ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే మొదట స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా నేడు.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఎక్సైజ్ పాలసీ, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, బాలికలు-మహిళల మీద అఘాయిత్యాలపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సోమశిల హైలెవల్ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ సభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించనుంది. ఇదిలా ఉంటే.. నేటితో ఈ దఫా శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నిత్యావసర ధరలు పెరుగుదల, టెలి మెడిసిన్ కేంద్రాలు పనిచేయకపోవడం, ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో వివక్షతపై టీడీపీ ప్రశ్నలు సంధించింది.

 

వేరుశనగ, పసుపు పంటలకు మద్దతుధర లేకపోవడంపై కూడా ప్రభుత్వాన్ని.. టీడీపీ ప్రశ్నించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా.. ఇవాళ మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది.

 

సోమవారం మొత్తం 16 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌(ఎస్సీ కమిషన్‌) బిల్లు-2019, రాష్ట్ర ఎస్‌టి (ఎస్టీ )కమిషన్‌ బిల్లు -2019, ఆర్‌టిసి బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగులపై పన్ను (సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ఆబ్కారీ (రెండవసవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మద్య నిషేధం (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ వస్తువులు, సేవల పన్నుల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల (రెండవ సవరణ) బిల్లు, జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, లలిత కళల విశ్వవిద్యాలయం(సవరణ) బిల్లు, చిరుధాన్యాల బోర్డు బిల్లులకు ఆమోదం తెలిపారు. వీటితోపాటు పప్పు ధాన్యాల బోర్డు బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల(రెండవ సవరణ) బిల్లు, కర్నూలులో క్లస్టరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చట్టం -2019, ఎపి మునిసిపల్‌ లా (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌-2019, ఆంధ్రప్రదేశ్‌ విద్యాహక్కు చట్టం(1/1982(అమెండ్‌మెంట్‌ యాక్ట్‌- 2019 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: