టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బాబు మాట్లాడిన అనంతరం సీఎం మాట్లాడారు. కాగా.. ఇవాళ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌లపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబు దారుణంగా అబద్ధాలు చెబుతున్నారని సీఎం మండిపడ్డారు.
 
చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు టీడీపీ సభ్యులు గొడవలు చేయలేదు కానీ.. సీఎం మాట్లాడుతుంటే అడ్డుకునే యత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు లాంటి నాయకుడా మనకు కావాల్సింది..?. ప్రతిపక్షనేతగా కూడా చంద్రబాబుకు ఉండే అర్హత లేదు. చారిత్రాత్మక బిల్లు తెస్తుంటే టీడీపీ సభ్యులు బఫూన్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అంశాలు ప్రజల్లోకి పోకుండా చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారు. నా ప్రతి అడుగు పేదవారికి తోడుగా ఉంటుంది’ అని జగన్ తెలిపారు.
 
‘నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 1992లో స్థాపించారు. బాబు మాత్రం తానే ఆ కమిషన్ తెచ్చానని చెబుతున్నారు. 2003లో ఎన్నికల కోసం కమిషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళితుల గురించి చాలా సార్లు లోకువగా మాట్లాడారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అన్నారు. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రి దళితుల్ని కించపరచలేదా?. రాజధానిలో ప్లాట్ల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం జరిగింది. ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు కమిషన్లు తీసుకొస్తాం. కేబినెట్‌లో 60శాతం ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు పదవులిచ్చాం. ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాం. దళిత మహిళను హోంమంత్రిగా నియమించాం. చంద్రబాబు ఒక్క ఎస్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. పట్టాభూములకు ఒక రకంగా అసైన్డ్‌ భూములకు మరో రకంగా కేటాయింపులు చేశారు. మార్కెట్‌ కమిటీల్లో అధికశాతం మైనార్టీలే చైర్మన్‌లుగా ఉన్నారు. 4 నెలల్లో లక్షా 80 వేల ఉద్యోగాలు ఇచ్చాం. టీడీపీ నేతలు బఫూన్లలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతల్ని సభ నుంచి సస్పెండ్‌ చేసినా తప్పులేదు’ అని బాబుపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
చంద్రబాబు ఏమన్నారంటే..‘ఎస్సీలకు న్యాయం చేసింది టీడీపీనే. ఎస్సీ, ఎస్టీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాం. సీఎం జగన్‌ కావాలనే రెచ్చగొడుతున్నారు. నేను అనని మాటల్ని అన్నట్లు చూపిస్తున్నారు. గుంటూరులో ఎస్సీ మహిళపై అత్యాచారానికి సమాధానం చెప్పాలి..?. ప్రివిలేజ్‌ నోటీసుపై చర్చించకుండా జగన్‌ పారిపోయారు’ అని చంద్రబాబు విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: