అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దిశ ఘటన తర్వాత దేశమంతా ప్రకటనలు మాత్రమే చేస్తే.. మహిళ భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని కొనియాడారు. మహిళలపై చేయివేస్తే కఠిన శిక్షలు తప్పవని సుచరిత హెచ్చరించారు. విచారణ గడువు 4నెలల నుంచి 21రోజులకు కుదించినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని, అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధిస్తామని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.


 
నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ కొంతమందికి చంద్రుడిలో మచ్చలే కనబడతాయని, దిశ ఘటనపై సీఎం ప్రకటనలో చంద్రబాబుకు టోల్‌గేట్‌ విషయమే కనబడిందని విమర్శించారు. మహిళలపై టీడీపీకి ఎలాంటి గౌరవం లేదని, దిశ బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభలో ఉండకుండా వాకౌట్‌ చేసిందని పుష్ప శ్రీవాణి విమర్శించారు.

 

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షం టీడీపీ కూడా బిల్లుకు మద్దతు తెలపగా.. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మనేని సీతారాం ప్రకటించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. తాము అధికారంలోకి వచ్చి ఆరునెలలే అయ్యిందని.. వ్యవస్థలో మార్పు కోసమే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవని.. విప్లవాత్మక చర్యలు తీసుకుంటనే మార్పు సాధ్యమని భావించామన్నారు.

 

దిశ వంటి ఘటన జరగకూడదంటే కఠిన చట్టాలు తప్పవన్నారు. అందుకే నేరం చేసిన వారిని 21 రోజుల్లోనే శిక్షించేలా చట్టాన్ని మార్పు చేశామని.. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నా.. తప్పులు చేసిన వాళ్లు యధేచ్చగా బయటకు వస్తారన్నారు జగన్. ఏడేళ్ల తర్వాత కూడా నిర్భయ కేసులో నిందితులలకు శిక్షపడ లేదన్నారు. మరోసారి దిశ నిందితుల అంశాన్ని ప్రస్తావించిన జగన్.. సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ అన్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత జాతీయ మానవహక్కుల సంఘం అభ్యంతరాలు తెలపడంపై ఆక్షేపించారు.

 

దిశ బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నామని.. దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో.. వాటిని అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయడ్డారు. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని చట్టాలను అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు బాబు. ఎవరైనా నేరానికి పాల్పడితే.. ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. దిశ బిల్లు శుక్రవారమే తమకు చేరిందని.. అయినా సరే తాము కూడా మద్దతు ఇస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: