టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాదిగా తమ పార్టీ అత్యంత నిరుత్సాహకరణమైన రీతిలో కొనసాగుతుండడంతో ఆయన అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అందరూ అనుకున్నారు. 2015 నుండి నాలుగేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం ఊరట లభించినా... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మాత్రం సతీమణి పద్మావతి ఓటమితో పిసిసి అధ్యక్షుడికి మిశ్రమ ఫలితాలు దక్కాయి. దీంతో టీపిసిసి అధ్యక్షుడు పదవి నుండి ఉత్తమ్ కుమార్ ను తప్పించడం పక్కా అని అందరూ అనుకున్నారు.

 

అయితే వ్యక్తిగతంగా తాను ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా బరిలో నిలిచి అక్కడ కూడా గెలిచి తనేంటో నిరూపించుకొని చివరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం ఎంపీ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ కొత్త వ్యూహాలు ఒక రేంజ్ లో పనిచేశాయి అనే చెప్పాలి. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడిగా తన పదవి ఊడకముందే ఉత్తమ్ కుమార్ కొత్తగా ప్రమోషన్ బాట పట్టబోతున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని పార్టీ కార్యాచరణపై పెద్దగా దృష్టి పెట్టని ఉత్తమ్ కుమార్ ఎంపీగా ఎక్కువకాలం ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే అక్కడ తన ప్రమోషన్ వర్క్ మాత్రం బాగా చేసుకున్నారు.

 

రాహుల్ గాంధీ త్వరలో మరోసారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో ఏఐసీసీ కమిటీలను పునర్వ్యవస్థీకరించనున్నారు. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని ఆయన అనుచరవర్గం చెప్పుకుంటోంది. అదే జరిగితే అది ఉత్తమ్‌కు ప్రమోషన్‌గానే భావించాలి. సో.. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కాకుండా.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించుకున్నట్లు అవుతుంది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఉత్తమ్ పాల్గొన్న తీరే ఆయన ఇన్ని రోజులు వేసిన వ్యూహాలు మరియు జరిపిన మంతనాలకు ఉదాహరణ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: