సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డు పడుతున్నారన్న కారణంగా  సమావేశాల నుండి తొమ్మిది మంది సభ్యులను స్పీకర్ సస్సెండ్ చేశారు. రాజధాని నిర్మాణంపై సభలో జరుగుతున్నచర్చకు టిడిపి సభ్యులు పదే పదే అడ్డుపడ్డారు.  చంద్రబాబునాయుడు హయాంలో రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతున్నపుడు సభ్యులు పదే పదే అడ్డుపడ్డారు.

 

చివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నదేమిటో కూడా ఎవరికీ వినబడకుండా ఒకటే అరుపులు మొదలుపెట్టారు. మంత్రులు, సభ్యులు ఎంతగా వారించినా సభ్యులు పట్టించుకోలేదు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేసిన అరాచకాలు ప్రజలకు తెలియకూడదనే టిడిపి సభ్యులు గోల చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోతునే ఉంది.

 

ఇదే విషయాన్ని జగన్ ఎన్నిమార్లు చెప్పినా టిడిపి సభ్యులు పట్టించుకోలేదు. చివరకు వేరే దారిలేక శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి బుగ్గన ప్రతిపాదన కారణంగా తొమ్మిదిమంది సభ్యులను సభనుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, గిరిధర్, ఏలూరి సాంబశివరావులను సభ నుండి సస్పెండ్ అయ్యారు.

 

సభలో గందరగోళం సృష్టించటం టిడిపి సభ్యులకు ఇదే మొదటిసారి కాదు. శీతాకాల సమావేశాలు మొదలైన దగ్గర నుండి కూడా  ఇదే వరస. తాము ఏమి మాట్లాడినా అధికార వైసిపి సభ్యులు వినాలని టిడిపి కోరుకుంటుంది. అదే జగన్ లేదా మంత్రులు లేకపోతే వైసిపి సభ్యులు ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం టిడిపి సభ్యులు రన్నింగ్ కామెంటరీ ఇస్తునే ఉంటారు.

 

నిజానికి చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరగిందనే విషయాన్ని బుగ్గన చదివి వినిపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో లబ్దిపొందిన టిడిపి నేతలు ఎవరెవరు, ఏ స్ధాయిలో లబ్దిపొందరు అన్న విషయాలను బుగ్గన రిపోర్టు ఆధారంగా సభలో చదివి వినిపించారు. దాంతో టిడిపి సభ్యులు గందరగోళం మొదలుపెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: