రాజధాని మార్పు తదితరాలపై జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అమరావతిని అభివృద్ది చేయటంపై తన అభిప్రాయాలను  కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాజాగా జగన్ చేసిన ప్రకటనతో స్పెక్యులేషన్ కు బ్రేకులు పడినట్లే అనుకోవాలి.  ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు వచ్చే అవకాశాలున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజులో సుదీర్ఘమైన చర్చ జరిగింది.

 

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అరాచకాలు, అవినీతి లాంటి అంశాల నుండి తమ హయాంలో ఎలా అభివృద్ధి జరగాలనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరగా జగన్ మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప రాష్ట్రం అభివృద్ధి జరగదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతి, జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

 

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయటానికి పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదన్నారు.  అదే విధంగా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ గా చేయటానికి కూడా ఖర్చులేమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలులో ఉన్న మౌళిక సదుపాయాలను ఉపయోగించుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రమే అమరావతి ఉంటే సరిపోతుందన్నారు. మూడు రకాల క్యాపిటల్ సిటీలు ఉంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు.

 

దక్షిణాఫ్రికాకు మూడు క్యాపిటల్స్ ఉన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అదే విధంగా ఏపికి మూడు క్యాపిటల్స్ ఉంటే తప్ప అభివృద్ధి జరగదన్నారు. చంద్రబాబునాయుడు తన హయాంలో మొత్తం అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకృతం చేయాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ తమ ప్రభుత్వం అలాంటి తప్పు చేయబోదని హామీ ఇచ్చారు. రాజధానిపై జగన్ చేసిన తాజా ప్రకటనతో అందరిలోను అనుమానాలు పటాపంచలైపోయినట్లే అనుకోవాలి. రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటిలు తమ నివేదికలను ఇవ్వగానే తమ పని మొదలుపెడతామని జగన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: