``న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. రాష్ట్రానికి బహుశా మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు నిర్మించే ఆలోచనలో ఉన్నాం. పాలన ఒకదగ్గర..జుడీషియల్ ఒకదగ్గర ఉంటాయి. అమరావతిలో చట్టసభలు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికు ప్రభుత్వానికి సమర్పిస్తుంది. త్వరలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం` ఇది  ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని తరలింపు తదితర అంశాలపై మాట్లాడిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.

 

రాజ‌ధాని త‌ర‌లింపు స‌హా ఇత‌ర అంశాల‌పై స్పందిస్తూ,  ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. రాజధాని అంశంపై అధ్యయానికి నియమించిన రెండు కమిటీలు మరో రెండు వారాల్లో నివేదిక ఇస్తాయని, వాటిపై కూలకషంగా చర్చలు జరిపిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఏపీలో ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్‌ను అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెల్ల‌డించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వున్న సంగతిని తెలిపారు. అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు.  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భావితరాల బాగోగులను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని, తమ నిర్ణయంలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు వుండవని ముఖ్య‌మంత్రి జగన్ చెప్పారు.

 

మ‌రోవైపు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ``జగన్ ప్రభుత్వానివి తుగ్లక్ చర్యలు.. రాజధానిని ఎవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా? సీఎం జగన్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు... సీఎం ఎక్కడ కూర్చుంటారు..? సీఎం ప్రకటనతో ప్రాంతీయ విభేదాలు వస్తాయి.. కేంద్రం దృష్టికి రాజధాని అంశాన్ని తీసుకెళ్తాం`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న స‌హ‌జంగానే రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌ను లేవనెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: