''ఏపీకి మూడు రాజధానులు''.. ఇప్పుడీ అంశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయంశమైంది. సౌతాఫ్రికా తరహాలో ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశముందని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జగన్‌పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే టీడీపీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నామని.. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎలా కడతారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ సైతం జగన్ వ్యాఖ్యలపై స్పందించింది.

 

'' హైకోర్టును కర్నూలులోనే పెట్టాలని మా మేనిఫెస్టోలో పెట్టాం.హైకోర్టు కర్నూలులో పెట్టినా బెంచ్ మాత్రం అమరావతిలోనే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలన్నదే బీజేపీ అజెండా. జగన్ తన ఆలోచన మాత్రమే చెప్పారు. జగన్ ప్రకటన అయోమయంగా ఉంది. క్లారిటీ లేదు. ఆయన మాటలకు..ప్రభుత్వ జీవోలకు చాలా తేడా ఉంది. జగన్ పాలన చూస్తుంటే అభివృద్ధికి ఆస్కారం కనిపించడం లేదు.'' అని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.

 

ఈ క్రమంలో సీఎం జగన్ మూడు రాజధానుల ఫార్ములాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగినట్లుగా.. అమరావతి పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు.''కమిటీ రిపోర్ట్ రాకమునుపే ,జగన్ గారు ,మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి?నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి?'' అని ట్విటర్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరం ఉందని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని వసతులు ఉన్నాయని, ఒక మెట్రో రైలు వేసుకుంటే సరిపోతుందన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: