ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను 2000 రూపాయల నుండి 2,250 రూపాయలకు పెంచింది.  అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. . అర్హత వయస్సును తగ్గించడం వలన 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాల్సి రావొచ్చునని అంచనా. ఈ నెల 13వ తేదీన పింఛన్ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ప్రకటించారు. 
 
తాజా నిబంధనల ప్రకారం పింఛన్లు పొందేందుకు నెలకు గ్రామాల్లో 10వేల రూపాయలు, పట్టణాల్లో 12వేల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి అర్హత కల్పించారు. 750 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉంటే నిబంధనల ప్రకారం పెన్షన్ పొందటానికి అర్హులు కాదు. ఆశాలు, అంగన్ వాడీ కార్యకర్తలు, వీఏఓలు, ఔట్ సోర్సింగ్ కుటుంబాలలో పింఛనుకు అర్హులుగా ఉన్నవారు ఇకనుండి అనర్హులుగానే పరిగణించబడతారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 54 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. 54లక్షల మందిలో 5లక్షల వరకు పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పింఛన్లకు పెట్టిన కొన్ని నిబంధనల వలన పేద వర్గాల్లోని, చిన్న ఉద్యోగ శ్రేణుల్లోని కొందరు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న కుటుంబాలు పన్నులు కడుతున్న కుటుంబాలా...? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు...? ఫింఛన్ పొందుతున్న వారి భూముల వివరాలు రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ నుండి అధికారులకు ఇప్పటికే నివేదికలు వచ్చాయి. 
 
ఈ నివేదికల ఆధారంగా వాలంటీర్లు తనిఖీలు చేపట్టి తమ దగ్గర ఉన్న వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ తరువాత కుటుంబ యజమాని నుండి వాలంటీర్లు ధ్రువీకరణ తీసుకుంటున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారో అర్థం కాకపోవటంతో కొన్ని ప్రాంతాలలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనల వలన చాలా మంది పింఛన్ కు అర్హత పొందలేకపోతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: