చంద్రబాబునాయుడుకు టిడిపి ఎంఎల్ఏ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పెద్ద షాక్ ఇచ్చారు.  జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు గంటా మద్దతు పలకటం పార్టీలో సంచలనంగా మారింది.  జగన్ ప్రతిపాదనకు ఒకవైపు చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా గంటా మాత్రం జగన్ నిర్ణయం మంచిదే అనటం పార్టీకి మింగుడుపడనిదే.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో గంటా కూడా ఒకరు. గెలిచిన దగ్గర నుండి గంటా పార్టీ మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు వైసిపిలో చేరిపోతారని మరికొద్ది రోజులు బిజెపిలోకి వెళిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సరే ఏ పార్టీలోకి మారుతారో తెలియనప్పటప్పటికీ ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ అవ్వటం లేదన్నది వాస్తవం. అలాంటిది ఒక్కసారిగా జగన్ ప్రతిపాదనకు గంటా మద్దతుగా నిలవటం పార్టీలో కలకలం రేగుతోంది. గంటా తాజా ప్రకటన చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.

 

గడచిన ఆరుమాసాలుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక రకాలుగా అనేక అంశాలపై ఎన్నో ఆందోళనలు చేశారు.  అయితే చాలమంది ఎంఎల్ఏలే చంద్రబాబు పిలుపుని లెక్కచేయలేదు. అటువంటి వాళ్ళల్లో గంటా కూడా ఒకరు. ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి బిజెపి అగ్రనేతలతో కూడా భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా సభలో టిడిపి విపరీతంగా అల్లరి  చేస్తోంది. మామూలుగా గంటా సమావేశాలకే పెద్దగా రావటం లేదు. ఒకవేళ వచ్చినా చంద్రబాబుకు మద్దతుగా కనీసం నోరు కూడా విప్పలేదు. ఇటువంటి నేపధ్యంలోనే సమావేశాల చివరి రోజున జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన సంచలనంగా మారింది. దాంతో చంద్రబాబు అండ్ కో జగన్ పై మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే గంటా మాత్రం జగన్ ప్రతిపదాన బ్రహ్మాండమంటున్నారు. మరి గంటా నిర్ణయం ఎటువంటి మార్పులకు దారితీస్తుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: