దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ అత్యాచారం, హ‌త్య విష‌యంలో సంచ‌ల‌నాలు వెలుగుచూస్తున్నాయి. దిశ నిందితులు ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, నవీన్, శివల వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే అత్యంత దారుణ‌మైన నేర‌చ‌రిత్ర ఉందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. దిశపై కిరాతకంగా లైంగికదాడి జరిపి...దహనం చేసిన నలుగురు నిందితుల ఉదంతం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అనంత‌రం వీరు ఎదురుకాల్పుల్లో మరణించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇలా మ‌ర‌ణించ‌డానికి ముందు పోలీసుల ఎదుట వెల్లడించిన వివరాలు అధికారులను విస్మయానికి గురిచేశాయి. దిశను మాత్రమేకాదు.. దిశ మాదిరిగానే మరో తొమ్మిది మందిని హత్యచేసి దహనం చేసినట్లు ఆ న‌లుగురు పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.

 

అమ్మాయిలు, మహిళలపై క‌న్నేయ‌డం...వారిని రేప్ చేయ‌డం, ఆ తర్వాత హత్య చేయ‌డం, అనంతరం మృతదేహాన్ని కాల్చేయడం...ఇది ఈ న‌లుగురు నిందితుల నేరాలు చేసే ఎత్తుగ‌డ‌. దిశ కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్ అలీ క‌ర‌డ‌గుట్టిన నేర‌స్తుడ‌ని పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన‌ట్లు స‌మాచారం. ఆ ఒక్కడే ఆరు హత్యలు చేసిన‌ట్లు పోలీసుల వ‌ద్ద అంగీక‌రించాడ‌ట‌. చెన్నకేశవులు మూడు హత్యలు చేసినట్లు ఒప్పుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల వద్ద చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిసింది. 

 


పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న స‌మ‌యంలో నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో అలాంటి ఘటనలు మొత్తం 15 జరిగినట్లు గుర్తించారు. నిందితులు పాల్పడిన తొమ్మిది హత్యలు ఏమిటన్నవి తేల్చడానికి...అధికారులు మొత్తం 15 హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు. చాలా కేసుల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల్లో పోలీసులకు దర్యాప్తులో సహకరించే విధంగా ఫలితాలు రాలేదు. దీంతో పోలీసు అధికారులు శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంచేశారు. హైవేలకు అనుకొని ఉన్న ప్రాంతాల్లో జరిగిన 15 హత్య కేసుల వివరాలను సేకరిస్తున్నారు.  ఈ 15 కేసుల్లో మృతుల డీఎన్‌ఏలతో, ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, నవీన్, శివల డీఎన్‌ఏలను లోతుగా విశ్లేషించనున్నారు. కాగా, ఇంత దారుణ‌మైన క్రిమిన‌ల్స్ అయిన ఈ న‌లుగురికి వ‌త్తాసుగా కొంద‌రు మాట్లాడుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: