పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9న లోక్ సభలో ఆమోదం పొందగా.. 11న రాజ్యసభలో ఆమోదం పొందింది. మరునాడే రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో సవాల్ చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. నూతన చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ జనాభాలో 15 శాతం మంది ముస్లింలు ఉన్నారు. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాలు.. అక్కడ ముస్లింలు మెజార్టీ కాబట్టి.. వారిని హింసకు గురవుతున్న మైనార్టీలుగా చూడలేమని కేంద్రం చెబుతోంది.

 

పౌరసత్వ సవరణ చట్టం వల్ల హిందువులైనా, ముస్లింలైనా.. భారతీయులపై ఎలాంటి ప్రభావ ఉండదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఇతర దేశాలకు చెందిన ముస్లింలు భారత్‌లోకి అక్రమంగా వలస వస్తే.. వారిని వారి స్వదేశాలకు పంపించడం తప్పేంటని ఈ చట్టాన్ని సమర్థించేవారు అంటున్నారు.


జామియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించడం పట్ల ఆయన స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని అడ్డుకోవడానికి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇలా చేయక తప్పలేదన్నారు. మంగళవారం ఇండియా ఎకనమిక్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను పెద్దది చేసి చూపొద్దన్నారు. దేశంలో 400 యూనివర్సిటీలు ఉండగా.. కేవలం 22 యూనివర్సిటీల్లోనే సీఏఏ పట్ల కొద్దిమేర మాత్రమే నిరసనలు కనిపించాయన్నారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, జమియా మిలియా, లక్నో, జేఎన్‌యూలలో మాత్రమే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శలు నిర్వహించారన్నారు. 

 

హింస ఏ రూపంలో ఉన్నా దాన్ని సమర్థించలేమన్న అమిత్ షా.. పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు.. మరింత దిగజారేలా చూస్తూ ఊరుకోలేమన్నారు. జామియాలో జరిగిన ఘటనలను బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవచ్చాన్నారు. నిరసనకారులు రువ్విన రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం విచారణ జరుపుతున్నామన్నారు. విద్యార్థులు కాకుండా భారీ సంఖ్యలో బయటి వ్యక్తులు ఉన్నారని షా తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసే విషయంలో తాము దృఢ సంకల్పంతో ఉన్నామన్న అమిత్ షా.. ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. తాము వెనక్కి తగ్గబోమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: