గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని రీతిలో జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా వెరైటి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో 13 జిల్లాలకు తలా ఓ పెద్ద టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర కనీసం 15 మంది కూర్చోగలిగినట్లుగా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగియగానే ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ బాగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

 

మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించటం సహజం. వారందిరినీ ఇతర ఉన్నతాధికారులతో కలిపి రాజధానికి పిలిపించుకుని సమీక్షిస్తుంటారు.  ఇటువంటి సమీక్షల్లో మంత్రులు ఉంటారు కానీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఉండరు. కనీ జగన్ నిర్వహించిన వెరైటి డిన్నర్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా హాజరయ్యారు.

 

జగన్ ఏర్పాటు చేసిన  డిన్నర్లో   జిల్లాల్లోని సమస్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. 13 టేబుళ్ళ దగ్గరకు జగన్ మాత్రమే తిరిగారు. జగన్ తో పాటు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా పాల్గొన్నారు.  ఎలాగూ డిన్నర్ మీటింగే కాబట్టి కలెక్టర్లు, ఎస్పీలు  బిగుసుకుపోకుండా స్వేచ్చగానే సమస్యలపై స్వేచ్చగా మాట్లాడినట్లు  తెలుస్తోంది.

 

గతంలో జరిగిన సమీక్షల వాతావరణానికి భిన్నంగా ఆహ్లాదకర వాతావరణంలో అందులోను డిన్నర్ సమీక్షలు కావటంతో అందరూ జోకులేసుకుంటు హ్యాపీగా గడిపినట్లు సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం జగన్ ప్రతి టేబుల్ దగ్గర కనీసం అర్ధగంటపాటు గడిపారట.

 

మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా పాల్గొన్న డిన్నర్ సమీక్షలో వివిధ పథకాల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావించారట. ఎటూ కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ కూడా టేబుల్ దగ్గరే ఉండటంతో కొన్ని అంశాల్లో నిర్ణయాలు కూడా అక్కడే జరిగిపోయాయట. మొత్తం మీద జగన్ నిర్వహించిన వెరైటి డిన్నర్ సూపర్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: