రాష్ట్రంలో వికేంద్రీకృత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులుగా ఉండవచ్చని అన్నారు. ఏపీ రాజధానిపై నిపుణులతో కూడిన కమిటీ కొద్ది రోజుల్లో ఒక నివేదికను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇలా మూడు రాజధానులను కలిగి ఉండడం వలన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 

 

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తన క్యాబినెట్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదురుగు ఉపముఖ్యమంత్రులకు చోటు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఏపీ కేబినెట్లో మంత్రులు కూడా అధిక శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. ఇలా పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే తన సన్నిహితులకు చెప్పారని తద్వారా వేల ఎకరాలు చంద్రబాబు బినామీల పేరు మీద భూమి రాయించుకున్నారని అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులు ఆరోపించారు.

 

అమరావతి పెద్ద బిల్డింగులకు అనువు కాదని ఈ ప్రాంతంలో మట్టి కేవలం 9 టన్నుల బరువును మాత్రమే మోయగలదని ఇలాంటి ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు ఎలా కడతారంటూ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతిపై సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సౌతాఫ్రికా తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టసభలు అమరావతిలోనూ, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, జ్యూడిషియరి రాజధానిగా కర్నూల్ ఉండొచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం ఉత్తరాంధ్ర వాసులు ఆనందం వ్యక్తం చేశారు. గత పాలకులు ఉత్తరాంధ్రకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారని జగన్ మోహన్ రెడ్డి మాత్రం విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తాననడం శుభపరిణామం అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: