2019 సంవ‌త్స‌రం తెలంగాణ కాంగ్రెస్‌కు చేదు ఫ‌లితాల‌ను..అనుభ‌వాల‌నే మిగిల్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు దూసుకెళ్ల‌గా..కాంగ్రెస్ ఉనికిని కూడా కాపాడుకులేక‌పోయింది. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో కొంత‌మంది  కాంగ్రెస్ అభ్య‌ర్థులు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో బ‌లంగా క‌నిపించిన‌ప్ప‌టికీ కేసీఆర్ చ‌రిష్మా ముందు కాంగ్రెస్ రాజ‌కీయం. .వ్యూహాలు..విమ‌ర్శ‌లు ఎందుకు ప‌నికిరాకుండా పోయాయి. ఫ‌లితంగా అత్తెస‌రు సీట్ల‌తో స‌ర్ద‌కుపోవాల్సి వ‌చ్చింది.

 

అయితే గెలిచిన వాళ్లు కూడా తొంద‌ర‌గానే కారెక్కివెళ్లిపోవ‌డంతో ఇప్పుడు కాంగ్రెస్ ఉనికియే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. రేవంత్‌రెడ్డి ఒక్క‌రే టీఆర్ ఎస్‌కు ధీటుగా నిలిచారు. సొంత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడినా.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి ఎంపీగా అద్భుత విజ‌యం న‌మోదు చేశారు. ఇక అదే స‌మ‌యంలో ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అవ‌స‌రాల రీత్య ఆయ‌న్ను న‌ల్గొండ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయించింది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

 

అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన  హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిని బ‌రిలోకి దింపారు. అయితే అక్క‌డ టీఆర్ ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి అఖండ మెజార్టీతో స‌త్తాచాట‌డంతో  సుధీర్ఘ‌కాలంగా ఉత్త‌మ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత నియోజ‌క‌వర్గంలో టీఆర్ ఎస్ జెండా ఎగిరింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ ఫెయిల్యూర్ అయ్యార‌న్న విమ‌ర్శ‌లు మ‌రింత వేడిగా మొద‌ల‌య్యాయి.

 

ఈక్ర‌మంలోనే ఆయ‌న టీపీసీసీ మార్పు చేయాల‌ని, త‌న‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని కూడా అధిష్ఠానం పెద్ద‌ల‌కు విన్నవించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి క‌నీస ఎదురొడ్డి ప్ర‌ద‌ర్శించ‌డం చేయ‌క‌పోవ‌డంతో రాష్ట్రంలో పార్టీ క‌కావిక‌లం అవుతోంది. టీఆర్ ఎస్‌లోకి లేదంటే బీజేపీలోకి శ్రేణులు వ‌ల‌స వెళ్తున్నారు.  మునిసిప‌ల్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా పార్టీలో ప్ర‌భుత్వంపై స‌రైన నిర‌స‌న గొంతు వినిపించే నాయ‌కుడే లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

 

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ కాంగ్రెస్ క‌న్నా ఓ సీటు ఎక్కువ‌గానే ద‌క్కించుకుని రెండో స్థానం త‌మ‌దే అన్న‌ట్లుగా ఇప్ప‌టికే జ‌నాల్లోకి మెసేజ్‌ను తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఇక మొన్న‌టి ఆర్టీసీతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు..ప్ర‌భుత్వ లోపాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వం వెన‌క‌బ‌డిపోయింద‌న్న వాద‌న రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: