దేశంలో బీజేపీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంత గొప్పగా ఏమీ లేదు. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడిచే కొద్దీ జాతీయ రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు ప్రకటన తరువాత బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీలు బీజేపీకి క్రమంగా దూరమవుతున్నాయి. 
 
బీజేపీ పార్టీ వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీని ఎన్డీఏలో చేర్చడానికి బీజేపీ జగన్ పై ఒత్తిడి కూడా తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ 22 లోక్ సభ స్థానాలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలంతో ఉన్న వైసీపీ పార్టీ 2020 ఏప్రిల్ నెలలో ఆ బలం 6కు పెంచుకోనుంది. రాజ్యసభలో తగినంత బలం లేని బీజేపీ పార్టీ వైసీపీని చేర్చుకుని బలాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు సమాచారం. 
 
పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్ ఎస్ పార్టీ వ్యతిరేకించగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమలు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందువలన బీజేపీ వైసీపీని ఎన్డీఏలో చేర్చుకొని పదవులు ఇచ్చే ఆలోచనలు చేస్తోందని సమాచారం. బీజేపీ వైసీపీకి కేబినేట్ బెర్తుతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాల్లో వైసీపీ ఎన్డీఏలో చేరితే ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు ఎవరో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 
 
జగన్ మాత్రం ప్రత్యేక హోదాకు అంగీకరిస్తే మాత్రమే ఎన్డీఏలో చేరతానని చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండటంతో వైసీపీ కూడా ఎన్డీఏలో చేరటానికి అంగీకరించే అవకాశం ఉంది. వైసీపీ పార్టీ ఇప్పటికే బీజేపీకి బయటినుండి మద్దతు ఇస్తున్నా బీజేపీ పార్టీ మాత్రం వైసీపీని భాగస్వామిగా చేర్చుకోవాలని భావిస్తోంది. బీజేపీ పార్టీ ఒత్తిడికి తలొగ్గి జగన్ ఎన్డీఏలో వైసీపీని చేర్చుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: