ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో ఆంధ్రప్రదేశ్ లో 52వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. మిగతా అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనిపై ఆ సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ  ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కీలక బిల్లును  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే జీతాలు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. 

 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో రూపొందించిన బిల్లును ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం జగన్ ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. కొత్త చట్టంతో 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆర్టీసీ విలీనం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

 

అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోరాదని 1997లో నాటి సీఎం చంద్రబాబు చేసిన చట్టం అడ్డంకిగా మారిందన్నారు సీఎం జగన్‌. అందుకే  కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. మిగతా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని ఏపీ సీఎం జగన్ అన్నారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వం ఉద్యోగులుగా మారబోతున్నారని ఆయన తెలిపారు. ఆర్టీసీని ఆదుకోవడానికి సీఎం జగన్ బడ్జెట్ లో రూ.1500 కోట్ల కేటాయించారని మంత్రి  పేర్నినాని అన్నారు. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల రూ. 3000 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుందని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: