గ‌త నెల‌లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ హోర ప్ర‌మాదం గుర్తుండే ఉంటుంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై 104 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ఓ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అంతే.. ఎడమవైపు ఉన్న రెయిలింగ్‌ను అదే వేగంతో ఢీకొని పైనుంచి కింద ఐటీ కారిడార్ మలుపు వద్ద పల్టీ కొట్టి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో అక్కడ నిలుచుని ఉన్న సత్యవేణి (56) అనే మహిళపై కారు నేరుగా పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. పక్కనే ఉన్న ఆమె కుమార్తె ప్రణీత (26), కుర్బా (26), ఆటోడ్రైవర్ బాలునాయక్ (38) తీవ్రంగా గాయపడ్డారు. బయోడైవర్సిటీ వంతెనపై జరిగిన ప్రమాదాల నేపథ్యంలో నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని జీహెచ్‌ఎంసీ నియమించిన విషయం తెలిసిందే.

 

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ...వంతెన ప్రమాదంపై నిపుణుల కమిటీ రిపోర్ట్‌ ఇచ్చిందని తెలిపారు. 'నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని కమిటీ పేర్కొంది. వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని సూచించింది. గంటకు 40కిమీ వేగంతో వెళ్లేందుకు వంతెనను నిర్మించారు. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వ అనుమతి రాగానే వంతెన తిరిగి ప్రారంభిస్తాం' అని కమిషనర్‌ వివరించారు. 

 


ప్రారంభించిన 20 రోజుల్లోనే రెండు ప్రమాదాలు జ‌ర‌గ‌డం ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఈ ఫ్లైఓవ‌ర్ `భ‌యో`త్పాతం క‌లిగిస్తోంది. ఓవర్‌ పైనుంచి ఇటీవల కారు బోల్తాపడిన అనంతరం వేసిన క‌మిటీ ప‌లు కీల‌క సిఫారసులు చేసింది. ఫ్లైఓవర్ డిజైన్ ప్రకారం వాహనాల వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు మించకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వారు నివేదికలో స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇవికాకుండా వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: