ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి, సౌతాఫ్రికా తరహాలో ఏపీకి కూడా మూడు రాజధానులు ఉండొచ్చేమో, అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ రాజధానులుగా ఉండొచ్చని జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రకటనతో మీడియాలో ఏపీ రాజధానులపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. దీనితో జగన్ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి పేర్ని నాని.

 

నిన్న (డిసెంబర్ 18) మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని రాజధానిపై అనవసర చర్చ జరుగుతోంది, అసలు జగన్ ఏం చెప్పారని ఈ చర్చ జరుగుతోంది, ఏపీకి మూడు చోట్ల రాజధానులు ఉండొచ్చు అని జగన్ తన ఆలోచనని మాత్రమే చెప్పారు అని నాని పేర్కొన్నారు. రాజధాని ఈ మూడు చోట్లలోనే ఉండొచ్చు లేదా మరొక చోటైనా ఉండొచ్చు అని మరో ట్విస్ట్ ఇచ్చారు మంత్రి. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వొచ్చు అన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సచివాలయం, అసెంబ్లీ వేరువేరు ప్రాంతాల్లో ఉంటే ఇబ్బంది ఏంటి అని నాని ప్రశ్నించారు.

 

ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది, కమిటీ నివేదిక వచ్చిన తరువాతే రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం అని నాని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఆశావహం వ్యక్తం చేశారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే రాజధానిపై నిర్ణయం ఉంటుందని నాని స్పష్టం చేశారు.

 

ప్రతిపక్షాలు రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి, అమరావతి రైతుల్ని రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని వారికే ఇచ్చేస్తాం అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని స్పష్టం చేసింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: