తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద పెట్టుబడులు పెట్టినవారు, స్థలాలో, పొలాలో కొనాలని ప్లాన్ చేసుకున్న వారు, అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని మంచి రేటు కోసం ఎదురుచూస్తున్నవారు వీలైనంత త్వరగా భూలావాదేవీల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే మంచిది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రభుత్వం భూముల విలువను పెంచబోతుంది. రిజిస్ట్రేషన్ ధరలు పెరగబోతూ ఉండటం వలన స్టాంప్ డ్యూటీల భారం కూడా పెరిగే అవకాశం ఉంది. 
 
కొన్ని రోజుల క్రితం ఉప్పల్ భగాయత్ లో రిజిస్ట్రేషన్ విలువ 7వేల రూపాయలు ఉండగా గజం 79 వేల రూపాయలకు పైగా పలికింది. రిజిస్ట్రేషన్ విలువ కన్నా మార్కెట్ విలువ భారీగా పెరగటంతో అధికారులు సీఎం కేసీఆర్ సూచన మేరకు 10 శాతం నుండి 100 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువల పెంపు ప్రతిపాదనలను పంపారు. మరో 7 రోజుల్లో ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రానుంది. 
 
2013 సంవత్సరం ఆగష్టు నెలలో తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరిగింది. సవరణ జరిగి చాలా సంవత్సరాలు కావడంతో రిజిస్ట్రేషన్ విలువలకు, మార్కెట్ ధరలకు పొంతన లేకుండా పోయింది. ప్రభుత్వం నిర్ధారించిన భూముల విలువను బట్టి సాధారణ సేల్ డీడ్ పై స్టాంపు డ్యూటీ కింద 6 శాతం ఫీజులను వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగనున్న నేపథ్యంలో విలువల సవరణ ఖాయమని తెలుస్తోంది. 
 
బహిరంగ మార్కెట్ విలువలకు అనుగుణంగా అసెస్ మెంట్ చేయటంతో పాటు కొత్త మార్కెట్ విలువను నిర్ధారించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. బడ్జెట్ లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 5000 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ప్రభుత్వం బడ్జెట్ అంచనాల ప్రకారం మరో 1200 కోట్లు రావాల్సి ఉంది. భూముల రేట్లను పెంచటం ద్వారా అంచనాల కంటే ఎక్కువ రాబడి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: