ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ పరిధిలోకి వెళుతుందా...? లేక సిట్ కొనసాగిస్తుందా...? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి సిట్ విచారణపై నమ్మకం లేదని సీబీఐ లేదా ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. 
 
హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ నెల 23వ తేదీలోగా వివేకా హత్య కేసు దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్ లో సమ్పర్పించాలని ఆదేశాలు జారీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త సిట్ ను ఏర్పాటు చేసినా ఈ కేసులో నేరస్తులు ఎవరో ఇప్పటివరకు తేలలేదు. సిట్ అధికారుల దర్యాప్తు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వివేకా హత్య జరిగి ఇప్పటికే 9 నెలలు గడిచింది. 
 
సిట్ బృందం దర్యాప్తు వివరాలను నివేదిక రూపంలో సమర్పించటానికి కసరత్తును ప్రారంభించింది. వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఒక చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ వేయడంతో సిట్ అధికారులు డిఫెన్స్ లో పడ్డారు. ఈ సంవత్సరం మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం మొదట సిట్ బృందాన్ని వివేకా హత్య కేసు విచారణ కోసం నియమించింది. 
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడప ఎస్పీ అభిషేక్ మొహంతీ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది. మొహంతీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లటంతో మూడవ సిట్ బృందం తెరమీదకు వచ్చింది. సిట్ అధికారులు పురోగతి సాధించకపోవటంతో సీబీఐ రంగంలోకి దిగుతుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నెల 23వ తేదీన వివేకా కేసు సీబీఐ పరిధిలోకి వెళుతుందా...? లేదా...? అనే విషయంపై స్పష్టత రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: