రాజధాని ప్రాంతంలో జరుగుతున్న బంద్ లో టిడిపి రైతులు అని ప్రత్యేకంగా ఎందుకని అంటున్నానంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది.  ఏపికి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంతంలో టిడిపికి మద్దతుగా ఉండే రైతులే మండిపోతున్నారు. రాజధానిని ఇక్కడ నుండి తరలించేందుకు లేదని, రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ ఒకటే యాగీ చేయటం విచిత్రంగా ఉంది.

 

జగన్ ప్రకటనపై రైతులు ఇంతగా ఆందోళన చేస్తున్నారంటేనే వారిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే వారిని టిడిపి రైతులు అన్నది. ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయచ్చని జగన్ అన్నారు. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలుంటుందన్నారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటిల్ గా కంటిన్యు అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడి రైతులు అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

 

నిజానికి హై కోర్టులో పనున్న వారు మాత్రమే కోర్టుకెళతారు. సచివాలయం, అసెంబ్లీలతో పనున్న వారు మాత్రమే అక్కడికి వెళతారు. మిగిలిన వాళ్ళకు వాటితో ఏం పనుంటుంది ? ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి అవసరమైన వాళ్ళు  హైదరాబాద్ కు రాలేదా ?

 

నిజానికి చంద్రబాబునాయుడు హయాంలో అమరావతిలో జరిగిపోయిన అభివృద్ధిని జగన్ ఏమీ అడ్డుకోవటం లేదు. ఎందుకంటే టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధంటూ పెద్దగా ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఏదో మూడు నాసిరకం భవనాలు కట్టి ఇదే సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టంటూ వందల కోట్ల రూపాయలు నాకేశారు. ఇపుడు నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తయితే కానీ వాటి నాణ్యత ఏపాటిదో తెలీదు.

 

వాస్తవాలు ఇలావుంటే రైతులు మాత్రం ఇక్కడ జరిగిపోతున్న అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తుండటమే విచిత్రంగా ఉంది.  అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే సచివాలయం లేకపోయినా చేయచ్చు. రైతుల నుండి సేకరించిన భూమిని వివిధ కంపెనీలకు, విద్యాసంస్ధలు తదితరాలకు కేటాయిస్తే అభివృద్ధి అదే జరుగుతుంది.  ఇంతోటి దానికి రైతులు జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారంటేనే వాళ్ళంతా టిడిపి రైతులనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరే చేస్తున్నదెవరైనా  మూడు రాజధానుల ప్రతిపాదనపై బంద్ అయితే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: