ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలకు పొంతన లేదని, సిలబస్ తో సంబంధం లేని ప్రశ్నలు ఇస్తున్నారని, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని, అర్థం పర్థం లేకుండా తెలుగు అనువాదాలు జరుగుతున్నాయని గతంలో ఏపీపీఎస్సీపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
కీ లో తప్పుల గురించి, మూల్యాంకనంలో లోపించిన సమతూకం గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్సీ నిర్వాకాలపై లెక్కలేనన్ని కేసులు కోర్టులో నడుస్తున్నాయి. సీఎం ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సహకారంతో ఏపీపీఎస్సీలో సమూల సంస్కరణలు జరగబోతున్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 
ప్రభుత్వం ఏపీపీఎస్సీలోని అన్ని లోపాలను సవరించి ఏపీపీఎస్సీ పారదర్శకంగా పని చేసేలా సంకల్పించింది. సమూల సంస్కరణల్లో భాగంగా ఏపీపీఎస్సీలో కీ లలో పొరపాట్లు లేకుండా రూపకల్పన సమయంలో పునఃసమీక్ష చేస్తారు.తెలుగు అనువాదంలో తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టటంతో పాటు గ్రూప్ 1 పరీక్షలో డిజిటల్ మూల్యాంకనాన్ని అమలు చేస్తారు. మెయిన్స్ పరీక్షలో ప్రశ్నాపత్రాలను ట్యాబ్ ద్వారా అందించి సమాధానాలను బుక్ లెట్ లో రాయిస్తారు. ఆ బుక్ లెట్ ను స్కాన్ చేసి కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. 
 
సమాధానాలకు మార్కులు వేసే నిపుణుడు ఏ కారణంతో అన్ని మార్కులు వేయాల్సి వచ్చిందో తెలియజేయాల్సి ఉంటుంది. గడువులోగా ఫలితాలను విడుదల చేయటంతో పాటు మూల్యాంకనం సమయంలోనే మార్కులను ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ప్రశ్నలు, జవాబులను జంబ్లింగ్ చేసి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవటంతో పాటు సిలబస్ కు అనుగుణంగా ప్రశ్నలు ఉండేలా జాగ్రత్త వహిస్తారు. మ్యాథ్స్, ఆర్ట్స్ అభ్యర్థులకు సమన్యాయం జరిగే విధంగా చర్యలను చేపడతారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: