మీ అమ్మాయికి పెళ్లి కాలేదా..? మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేవా..? సంతానం కోసం పూజలు , వ్రతాలు చేస్తున్నారా...? మీ కష్టాలన్నింటికీ ఒకే పరిష్కారం.. ఆయనే బాబా బ్లాక్ మ్యాజిక్‌... సంతానం, సౌభాగ్యం, ఇలా మీకు ఏం కావాలన్నా దానికోసం ఓ స్కీమ్‌.. ఈ బాబా దగ్గర రెడీగా ఉంటుంది. రండి.. ఆరోగ్యాన్ని , ఆనందాన్ని డబ్బును పొందండంటూ... ఈ బురిడీ బాబా విసిరిన వలకు చిక్కిన భక్తులు.. 40 కోట్ల రూపాయల మేర బుక్కయ్యారు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదుతో బాబా కటకటాల పాలయ్యాడు.

 

అమాయక జనం కష్టాలను ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి మోసం చేసిన ఓ బాబా బాగోతం... బయటపడింది. హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ కు చెందిన గిరీష్‌సింగ్ .. బాబాగా మారి జనాన్ని మోసం చేశాడు. నమ్మి వచ్చినవారి దగ్గర నుంచి అందిన కాడికి దండుకున్నాడు.  గిరీష్ సింగ్ చదివింది డిగ్రీ మాత్రమే..కానీ అమాయకపు ప్రజలను తన ఆధ్యాత్మిక భోదనలతో మోసగించడంలో పి.హెచ్.డి చేశాడు. సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఇతను ఈజీగా మనీ సంపాదించాలని ప్లాన్ వేసాడు. బాబాగా అవతారం ఎత్తి అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ పేరుతో ఓ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించాడు. అమాయకపు ప్రజలకు మాయ మాటలు చెప్పి వారి  ద్వారా పెట్టుబడులు పెట్టించి నిండా ముంచేసేవాడు. ఇతని ప్రధాన టార్గెట్ మహిళలే. వివిధ రకాల ప్రక్రియలు, స్కీమ్ ల పేరుతో మహిళలను నేరుగా సంప్రదించేవాడు. తన మాటలతో వారిని నమ్మించేవాడు. కొంత మొత్తం తన దగ్గర పెట్టుబడి పెడితే మీ కుటుంబంలో సిరి సంపదలు కలుగుతాయని ఆశ చూపేవాడు.

 

తన వద్దకు వచ్చిన ప్రతి మహిళ దగ్గర నుంచి భారీ మొత్తాల్లో నగదు కాజేసేవాడు ఈ దొంగబాబా. ఆధ్యాత్మిక ప్రవచనాలతో రోజు రోజుకు తన దందాను వ్యాప్తి చేస్తూ వచ్చాడు. వందలాది మంది దగ్గర నుంచి 40 కోట్ల రూపాయల వరకు సొమ్ము దోచుకున్నాడు ఈ బాబా. చివరకు ఓ మహిళను మోసగించడంతో... ఆమె పోలీసులకు  ఫిర్యాదు చేసింది. దీంతో బాబాగారి బండారం బయటపడింది. పోలీసుల తవ్వకాల్లో ఈ బురిడీ బాబాపై ఉన్న పాతకేసులన్నీ బయటకువచ్చాయి. ఇతడో నేరస్తుడని తేలింది. గిరీష్‌పై ఛీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు..ఇలాంటి ఫేక్ బాబాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: