సంక్రాంతి పండుగ సమీపిస్తోంది.  పండుగకు వెళ్లేందుకు జనం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. రెండు నెలల ముందుగానే రైళ్లలో సీట్ల బుకింగ్ భర్తీ అయిపోయాయి. పోనీ ట్రైన్ టికెట్ దొరకడం లేదని, బస్సులను ఆశ్రయిస్తే.. అక్కడా అదే పరిస్థితి. దీనికి తోడు ఏటా పండుగ సమయంలో ధరలు పెంచుతూ ప్రైవేటు బస్సులు ప్రయాణీకుల్ని దోచేస్తున్నాయి. 

 

పండగొస్తోంది. పల్లె పిలుస్తోంది. వెళదామంటే ట్రైన్లు, బస్సుల్లో ఖాళీ లేదు. ఇప్పుడెలా సొంతూరికి వెళ్లాలి. ప్రైవేటు బస్సుల వైపు చూద్దామంటే.. ఆ ధరలు చూస్తేనే గుండె దడ వస్తుంది. ఏటా పండుగ సమయంలో ఎదురయ్యే కష్టాలు.. ఈ ఏడాది మొదలయ్యాయి. పండుగ సమయంలో టికెట్లకు డిమాండ్ పెరగడం, అదీ ముందస్తుగా బుకింగ్ అయిపోతుండటంతో.... రిజర్వేషన్లు చేసుకోవాలనుకునే వారికి నిరాశే మిగులుతోంది. పండుగ రద్దీకి తగినట్లుగా ట్రైన్లు లేకపోవడంతో.. ప్రయాణీకులు ఇబ్బందులుపడుతున్నారు. జనవరి నెలతో పాటు ఫిబ్రవరి చివరి వరకు ఇదే పరిస్థితి ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో కూడా రిజర్వేషన్ లు ఫుల్ అయినట్లు ఆయా వెబ్ సైట్స్ చూపిస్తున్నాయి. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు, ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడిపిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక బస్సులకు సంబంధించిన ప్రకటన విడుదల చేసేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

ప్రతిరోజూ జంటనగరాల నుంచి సుమారు రెండున్నర లక్షల మంది ప్రయాణీకులు వివిధ ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచే లక్షా 93 వేల మంది ప్రయాణిస్తారు. సంక్రాంతి సెలవుల్లో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది ప్రయాణీకులు అదనంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ డిమాండ్‌కు తగినవిధంగా రైళ్లు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. పండుగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకరైళ్లను ముందస్తుగా ప్రకటించవలసి ఉండగా, పండుగ సమీపించాక వేస్తున్నారు. దీంతో అప్పటికే ప్రయాణీకులు ప్రైవేటు బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించవలసి వస్తుంది. పైగా పండుగ ముందు అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే హోల్డ్ చేసి పెడుతున్నారు.

 

ఏటా కనీసం ఐదారు లక్షల మంది అయ్యప్ప భక్తులు హైదరాబాద్‌ నుంచి శబరికి వెళ్తారు. జనవరి మాసంలో ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుంది. కానీ హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్‌ ట్రైన్‌. ఇక ఏటా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు వేస్తున్నారు. ఈసారి కూడా 80 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందించింది. కానీ హైదరాబాద్‌ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో జనవరి నాటికి బెర్తులు బుక్‌ అయ్యాయి. అయితే సంక్రాంతి పండగ రద్దీతో ఈసారి 10 సువిధ, జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కరీంనగర్‌ - తిరుపతి మధ్య వారానికి మూడుసార్లు నడిచే ప్రత్యేక రైలును ఏప్రిల్‌ 1 వరకు, తిరుపతి - నాగర్‌సోల్‌ వయా సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలును మార్చి 28 వరకు 36 ట్రిప్పులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: