ఉత్తర భారతంపై మరోసారి చలిపులి పంజా విసురుతోంది. ప్రధానంగా దేశరాజధాని చలితో వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో.. స్కూళ్లకు మళ్లీ సెలవులిచ్చారు. 

 

రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత పెరిగింది. జనాలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. చలి కారణంగా నొయిడా సహా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్కూళ్లకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాతావరణం మరింత చల్లగా మారడంతో 19, 20 తేదీల్లోనూ గౌతమ్‌ బుద్ధ్‌నగర్‌లోని పలు స్కూళ్లు మూసి ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి స్కూళ్లకు చలికారణంగా సెలవు ప్రకటించినట్టు గజియాబాద్‌ డీఎం చెప్పారు.

 

వరుసగా రెండోరోజు చల్లగాలులు వీస్తుండడంతో ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని.. వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం.. గత 22 సంవత్సరాల్లో ఢిల్లీ ఇప్పుడే చూస్తోంది. డే టెంపరేచర్‌ 12.2 డిగ్రీలకు పడిపోయింది. బుధవారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. గ్రేటర్‌ నొయిడా, గజియాబాద్‌ ఏరియాల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ యూపీలో పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. అంతేకాదు, ప్రయాగ్‌రాజ్‌తో సహా పలు ప్రాంతాల్లో విపరీతమైన చలి ఇబ్బందిపెడుతోంది. 

 

ఉత్తరాఖండ్‌లో సాధారణ జనజీవనం చలితో తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోడ్స్‌, రైల్వేస్‌, ఎయిర్‌వేస్‌ పై కూడా చలి మంచు ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. అధిక మంచు కారణంగా డెహ్రాడూన్‌ నుంచి పలు ఫ్లైట్స్‌ రద్దుకాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో మంచు వర్షం కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గడ్డగట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శ్రీనగర్‌లో రాత్రి ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలుగా , పగటి ఉష్ణోగ్రత 5.8 డిగ్రీలుగా నమోదైంది. జమ్మూ రీజియన్‌లో గత శుక్రవారం నుంచి మంచు కురుస్తూనే ఉండడంతో.. రోడ్లకు, విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రెండు మూడు రోజుల నుంచి దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.

 

రాజస్థాన్‌లోని సికార్‌ ప్రాంతం 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో.. రాష్ట్రంలోనే అతిచల్లని ప్రాంతంగా నిలిచింది. మరో 24 గంటలు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: