దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సంబాల్ టౌన్ లో ఆందోళనకారులు ప్రభుత్వ బస్సుకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సంబాల్ లో 144 సెక్షన్ ను విధించారు. 
 
వివిధ ప్రాంతాల నుండి పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. మరోవైపు ఎర్రకోటకు వందలాదిగా చేరుకున్న వామపక్ష కార్యకర్తలు ర్యాలీకి ప్రయత్నించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఎర్రకోట దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. 
 
ఢిల్లీలోని పలు ప్రాంతాలలో ఇంటర్నెట్ బంద్ చేయగా 19 మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. పోలీసులు పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్ ఉన్నరు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనల హోరు ఆకాశాన్ని అంటుతోంది. పోలీసులు పలు రోడ్ల కూడళ్ల వద్ద బ్యారికేడ్లు పెట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 
ఢిల్లీ - గురుగ్రామ్ బోర్డర్ దగ్గర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు ఇప్పటికే రాజీవ్ గాంధీ విమానశ్రయానికి చేరుకునే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశాయి. విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో ట్రాఫిక్ ఇబ్బందులు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయని విస్తారా ఎయిర్ లైన్స్ విమానం సిబ్బంది కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారని ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో కూడా వామపక్షాలు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: