ఆ యువకుడు పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత కొన్ని కారణాల వలన చదువుకు దూరమై స్కూల్ బస్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. అదే స్కూల్ లో టీచర్ గా పని చేసే పీజీ చదివిన యువతి యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ప్రేమను పెద్దలకు చెప్పలేక, తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోలేక మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో తూర్పు పాలెం గ్రామానికి చెందిన సూర్యకుమారి, చిక్కు రాముడు దంపతుల కుమార్తె ప్రశాంతి. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు కష్టపడి ప్రశాంతిని పీజీ వరకు చదివించారు. ప్రశాంతి ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ ఉండేది. ప్రశాంతి రాజోలు మండలానికి చెందిన స్కూల్ బస్ డ్రైవర్ గా పని చేసే రమేష్ తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం ప్రశాంతికి ఆమె తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. ఆ తరువాత రోజున కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ప్రశాంతి ఇంటి నుండి బయటకు వెళ్లింది. ప్రశాంతి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. ఆ తరువాత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రమేష్, ప్రశాంతి మృతదేహాలను యానాం దగ్గర ఉన్న గోదావరి నదిలో గుర్తించారు. 
 
ప్రశాంతి తల్లిదండ్రులు తమ కూతురు ప్రేమ గురించి చెప్పి ఉంటే వివాహానికి అంగీకరించి ఉండేవాళ్లమని చెబుతున్నారు. పెద్ద ఉద్యోగం సంపాదించి తమకు కష్టాలు లేకుండా చేస్తానని చెప్పిన కుమార్తె చనిపోవటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రమేశ్ తల్లిదండ్రులు సీత, కృష్ణమూర్తి చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రేమజంట చావు ఇరు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: