అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అటవీ ఉద్యానవనాల  గురించి  మాట్లాడుతూ ...  నగర, పట్టణ వాసులకు శారీర‌క దారుఢ్యం, మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయ‌ని ఆయన  అన్నారు. మంత్రులు ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి  కలిసి హైద‌రాబాద్ శివారులో ఐట‌ర్ రింగ్ కు స‌మీపాన‌ పెద్ద గోల్కొండ‌, తుక్కుగూడ గ్రామాల మ‌ధ్య మ‌సీదుగ‌డ్డ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్) ను ప్రారంభించారు.

 

న‌గ‌రాలు ప‌ట్టణాల‌కు ద‌గ్గర్లో నిరుప‌యోగంగా ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ బ్లాకుల‌ను ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే విధంగా అభివృద్ది చేస్తున్నామ‌ని  మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.  మొత్తం 94 పార్కులను ఒక్కో పార్క్‌‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో థీమ్‌‌తో  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందులో hmda ప‌రిధిలో 60, ఇత‌ర ప‌ట్టణాల్లో 34 అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక‌లు రూపొందించారని చెప్పారు.

 

 

 31 పార్కులు ఇప్పటికే పూర్తి కాగా అందులో 17 పార్కులు  HMDA ప‌రిధిలో, 14 పార్కులు ఇత‌ర ప‌ట్టణాల్లో ప్రజలకు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. కుటుంబంతో రోజంతా న‌గ‌ర వాసులు  ఆహ్లాదంగా గ‌డ‌ప‌డానికి అన్ని సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఇత‌ర న‌గ‌రాల మాదిరిగా హైద‌రాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మార‌కూడదన్న ఉద్దేశ్యంతో అర్బన్ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని చెప్పారు.

 


180.03 హెక్టార్లలో రూ.4.34 కోట్ల వ్యయంతో మ‌సీదుగ‌డ్డ జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్కు) ను  స‌ర్వాంగ సుంద‌రంగా రూపొందించారు. ఈ పార్కును న‌గ‌ర వ‌న‌ ఉద్యాన యోజ‌న‌, కంపా, అట‌వీ శాఖ నిధుల‌తో  అభివృద్ది చేశారు. అంతేకాదు  ఈ పార్కులో వాకింగ్, ర‌న్నింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ ఫెసిలిటీస్, సాహాస క్రీడ‌లు, సైక్లింగ్‌ ట్రాక్‌, చిన్న పిల్లలకు ఆట స్థలం, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్‌ స్పాట్, అక్కడే వంట చేసుకుని వీలుగా ప్రత్యేక ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: