తెలుగుదేశంపార్టీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో  ఏమి జ‌రుగుతుందో ఆపార్టీ అధినేతలకే  అంతు చిక్కని పరిస్థితి నెలకొంది .  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల ఫార్మూలాను టీడీపీ నేత‌లు  స్వాగ‌తించ‌డం చంద్రబాబును షాక్ గురిచేస్తే , తన నిర్ణయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకించడం జగన్ ను విస్మయానికి చేసినట్లుంది  . జగన్ ప్రతిపాదనను  నిన్న టీడీపీ కి చెందిన  మాజీమంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు స్వాగ‌తించ‌గా, నేడు కొండ్రు ముర‌ళీ కూడా  భేష్ అంటూ కితాబునివ‌డాన్ని బాబు  జీర్ణించుకోలేక‌పోతున్నారు.

 

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధాని న‌గ‌రాల‌ను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు . అమరావతి తోపాటు , విశాఖ, కర్నూల్ లో రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అసెంబ్లీ సమావేశాల చివరిరోజు జగన్ ప్రకటించిన విషయం తెల్సిందే . అయితే జగన్ ప్రతిపాదనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించగా , ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించి సంచలనం సృష్టించారు . గంటా రేపిన దుమారం సద్దుమణిగిందని భావిస్తోన్న తరుణం లో కొండ్రు మురళి కూడా , విశాఖ ను రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు . పార్టీ నిర్ణయం కంటే ప్రాంత అభివృద్దే తనకు ముఖ్యమంటూ మురళి ధిక్కార స్వరాన్ని విన్పించారు . మురళి వ్యాఖ్యల వెనుక శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ మంత్రి కొడాలినాని ఉన్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

తెలుగుదేశం పార్టీ అధినేతపై అసెంబ్లీ లో , బయట ఒంటికాలిపై లేస్తోన్న నాని , ఎలాగైనా ఆ పార్టీని దెబ్బతీయాలన్న కసితో ఉన్నారని , అందుకే జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు పై తెలుగుదేశం పార్టీ అధినేత కు సొంత పార్టీ నేతలు ఝలక్ ఇచ్చినట్లుగానే , వైస్సార్ కాంగ్రెస్ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆ పార్టీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకించి సంచలనం సృష్టించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: