జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన  రాష్ట్రంలో  సంచలనం రేకెత్తించింది.   రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు ఆలోచనలు ఒక విధంగా ఉంటే జగన్ ఆలోచనలు మరొకవిధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. సరే వీళ్ళ ఆలోచనలు ఎలాగున్న బేసిక్ గా రాజకీయ కోణంలోనే ఉంటుందని కాసేపు అనుకుందాం. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటి చేసిన సిఫారసులనే జగన్ ఫాలో అవుతున్నారు.

 

అసలు కమిటి ఏమి చెప్పిందో చూద్దాం. భవన నిర్మాణ, ఆర్ధికరంగాల్లో నిపుణుడైన తమిళనాడు రిటైర్డ్ ఐఏఎస్  అధికారి శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో ఓ కమిటి అప్పట్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరిగింది. కొన్ని వేలమందితో సమావేశమై వాళ్ళ అభిప్రాయాలను, సూచనలను సేకరించింది. అనేక అంశాలను స్టడీ చేసి చివరకు ఓ నివేదికను అందించింది.

 

కమిటి నివేదిక ప్రకారం ఏపికి అతిపెద్ద ఏకైక రాజధాని ఉండకూడదని స్పష్టంగా చెప్పింది. రాజధానిని వికేంద్రీకరించాలన్నది. అధికార వ్యవస్ధలను వికేంద్రీకరించటంతో పాటు ప్రభుత్వ వ్యవస్ధలను కూడా వికేంద్రీకరించాలని సూచించింది. విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య అధికార వ్యవస్ధలను వికేంద్రీకరించాలని చెప్పింది.

 

శాసనసభ, సచివాలయం ఉన్నచోటే హై కోర్టు కూడా ఉండాలని రూలు లేదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. విజయవాడ-గుంటూరు మధ్య అసలు రాజధాని వద్దే వద్దని మొత్తుకున్నది. ఎందుకంటే ఈ ప్రాంతం ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములని కమిటి తేల్చింది. రాజధాని పేరుతో ఈ భూములను ధ్వసం చేస్తే ఆహారకొరత వచ్చే ప్రమాదముందని కూడా హెచ్చరించింది.

 

రాజధాని పేరుతో విజయవాడ-గుంటూరు మధ్య మొత్తం అధికార, శాసన వ్యవస్ధలను కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి దెబ్బ తింటుందని కూడా చెప్పింది. నివేదికలో ఇంకా చాలా చెప్పినా చంద్రబాబునాయుడుకు ఏవీ ఎక్కలేదు. పైగా అమరావతి ప్రాంతంలోనే రాజధాని బాగుంటుందని కమిటి చెప్పినట్లుగా చంద్రబాబు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.  పైగా కమిటి చెప్పినట్లు నడుచుకుంటే బాగుంటుందని ప్రతిపాదిస్తున్న జగన్ పై బురద చల్లుతు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: