అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన `ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో`ప్ర‌క‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అవుతున్న సంగ‌తి తెలిసిందే. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష టీడీపీలోనే భిన్నస్వరాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. అయితే, ఇప్పుడు అధికార‌ వైసీపీలోనూ రాజధానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది బయటపడింది.  నర్సరావుపేట (వైసీపీ) ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా చెప్పాలంటే..జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు.

 


తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమ‌ని పేర్కొంటూ...అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకేచోట నుంచి చేస్తే బాగుంటుందని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనేది తన ఉద్దేశ్యం అన్నారు. కాగా, సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానులపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ అస‌మ‌తూల్య‌త చోటు చేసుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పేర్కొంటే...దానికి భిన్నంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్లు చేయ‌డం స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రం ఇచ్చిన‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇదిలాఉండ‌గా, మంత్రి  కొడాలి నాని మాట్లాడుతూ  సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చారు. అమరావతి నుంచి రాజధానిని పూర్తిగా తీసేస్తున్నట్లు జగన్‌ చెప్పలేదని అన్నారు. మూడు రాజధానులు చేసే అవకాశం ఉందంటూ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత... చంద్రబాబు నాయుడు తప్పుబట్టడంపై స్పందించిన ఆయ‌న‌... ముందుగా మూడు రాజధానులపై ఆ ప్రాంతాల నేతలతో చంద్రబాబు చర్చించాలని సూచించారు. కమిటీ నివేదిక ప్రకారమే ప్రభుత్వం రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: