సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌తో స‌మావేశం అంటే....ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకింత ఆలోచిస్తున్నారట‌. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయ చేస్తూ టీఆర్‌ఎస్‌ను బ‌ల‌మైన‌ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతున్న యువ‌నేత వ‌ద్ద‌కు ఒక‌సారి వెళ్లిన నేత‌లు...ఇంకోసారి స‌మావేశం అయే విష‌యంలో సంశ‌యిస్తున్నార‌ని టాక్‌. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధినేత‌, సీఎం కేసీఆర్ అందించిన‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గులాబీ పార్టీని గెలిపిస్తూ వ‌స్తున్న కేటీఆర్...రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల విష‌యంలో పెడుతున్న ష‌ర‌తులు నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయంటున్నారు.

 

త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఘన విజయం సాధించేలా పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సర్వసన్నద్ధం చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఇంఛార్జ్‌లను నియమించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్నారు. మున్సిపాలిటీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి తరచు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా నాయకులకు సూచనలు ఇస్తున్నారు.

 

అయితే, ఎన్నిక‌లు వ‌స్తుంటే ఎమ్మెల్యేలు, ముఖ్య‌నేత‌లు స‌హ‌జంగానే...త‌మ వారికి టికెట్లు ఇవ్వాలంటూ రిక్వెస్టులు పెడుతుంటారు. సామాజిక‌వ‌ర్గం, పార్టీకి చేసిన సేవ లేదా మ‌రే కార‌ణ‌మో పేర్కొంటూ కొంద‌రికి కౌన్సిల‌ర్ చాన్సివ్వాలంటూ కోరుతుంటారు. టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌ద్ద‌కు ఇలాంటి ప్రతిపాద‌న‌లే వ‌స్తున్నాయ‌ట‌. అయితే, కేటీఆర్ వారికో ట్విస్ట్ ఇస్తున్నార‌ట‌. రాబోయే ఎన్నిక‌ల్లో వారిని ఖ‌చ్చితంగా గెలిపించుకునే బాధ్య‌త తీసుకుంటారా? అంటూ ఎదురు ప్ర‌శ్న వేస్తున్నారట‌. దీంతో షాక్ అవుతున్న నేత‌లు, ఎమ్మెల్యేలు...తేడా వస్తే క‌ష్ట‌మ‌ని...మ‌రోమారు ఆయ‌న్ను క‌లిసేందుకు, ఈ విష‌యం ప్ర‌స్తావించేందుకు జంకుతున్నార‌ట‌.యువ‌నేత ద‌గ్గ‌ర‌కు త‌మ వాళ్ల కోసం వెళితే...ఆయ‌నే పెట్టే ష‌ర‌తులు ఇంత ఖ‌చ్చితంగా ఉంటాయా అంటూ చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: