న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని...ఇందుకోసం విశాఖ, కర్నూలు, అమరావతిలలో మూడు ప్రధాన విభాగాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో మూడు రాజధానుల అంశం అతిపెద్ద చర్చనీయాంశంగా మార‌గా...ఇది పొరుగున ఉన్న తెలంగాణ‌కు సైతం పాకింది. ఇటీవ‌లే ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ‌లో ఈ డిమాండ్ ఎందుకు వ‌స్తుందంటారా?  తెలంగాణ‌లో వ‌చ్చిన డిమాండ్ మ‌రింత ఆస‌క్తిక‌రం. పైగా ఈ డిమాండ్ చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ.

 

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ....ఏపీలో తరహాలోనే తెలంగాణకు మూడు రాజధానులు అవసరమని అన్నారు. అదిలాబాద్ వంటి పట్టణాలు హైదరాబాద్‌కు సూదూరంలో ఉన్నాయని, దాంతో అక్కడ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని బాపూరావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం అభివృద్ధి జరగడం అంత శ్రేయస్కరం కాదని చెబుతూ...అదిలాబాద్‌లో శాసనసభ, శాసనమండలి ఏర్పాటు చేసి, సంవత్సరంలో ఒకటి, రెండు సార్లు సభా సమావేశాలు నిర్వహిస్తే.. అదిలాబాద్‌ బాగా డెవలప్ అవుతుందని సోయం బాపురావు అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఆలోచ‌న చేయాల‌న్నారు. 

 

ఓవైపు ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న ఆ రాష్ట్రంలో ప్ర‌కంప‌న‌ల‌కు దారితీస్తుండ‌గా...తెలంగాణ‌లో ఈ ఎంపీ చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చనీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఏపీలో జగన్ ప్రకటనను బిజెపి నేతలు పాక్షికంగా స్వాగతించగా.. తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సైతం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను వ్య‌తిరేకించ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి త‌రుణంలో..తెలంగాణ ఎంపీ సోయం బాపురావు..ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కాపీ కొట్టేయాల‌ని సీఎం కేసీఆర్‌కు సూచించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.  కాగా, ఏపీలోని మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌లు, దాని ఆధారంగా తెలంగాణ‌లో ఎంపీ చేసిన ప్ర‌తిపాద‌న‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: