ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పై ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలే జరుగుతున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాలు బంద్ లు కూడా నిర్వహించాయి. ర్యాలీలు, ఆందోళనలు, భారీ ప్రదర్శనలు నిర్వహించగా, ఇలాంటి బిల్లును తీసుకురావడం తగదని దాదాపు వెయ్యి మంది మేధావులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించి తాజా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక.

  
ఇటువంటి సమయంలో బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ కు భారత పౌరసత్వం ఇస్తామన్నారు. పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఇటీవలే మరణ శిక్ష విధించిన నేపథ్యంలో.. సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముషారఫ్ 1943లో పాత ఢిల్లీలోని దర్యాగంజ్‌లో పుట్టారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది.


దర్యాగంజ్‌లో జన్మించిన ముషారఫ్ ప్రస్తుతం పీడనకు గురవుతున్నారు. ఆయనకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఇవ్వగలం. హిందువుల సంతతి వారెవరైనా కొత్త పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం దీనికి అర్హులే’ అని స్వామి ట్వీట్ చేశారు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి.. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు గానూ పాకిస్థాన్ స్పెషల్ కోర్టు ముషారఫ్‌ కు మరణ శిక్ష విధించింది. కానీ ఈ తీర్పు పట్ల పాకిస్థాన్ సైన్యం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయన సౌదీలో చికిత్స పొందుతున్నారు.


కార్గిల్ యుద్ధానికి వ్యూహరచన చేసిన పర్వేజ్ ముషారఫ్‌.. భారత పౌరసత్వ కోరతారని భావించలేం. కానీ ఆయనకు పౌరసత్వం ఇస్తామనడం ద్వారా భారత్ గొప్పదనాన్ని చాటడంతోపాటు.. పౌరసత్వ చట్టం ద్వారా ముస్లింల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న విపక్షాల ఆందోళనకు చెక్ పెట్టొచ్చనేది స్వామి వ్యూహంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: