రాజధాని  అమరావతిలో సేకరించిన భూముల విషయమై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపికి మూడు రాజధానులు అవసరమని జగన్ ప్రతిపాదన చేసిన తర్వాత అందుకు తగ్గట్లుగానే పావులు చకచక కదులుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రైతుల నుండి సేకరించిన భూమిలో అవసరమైనంత భూమిని మాత్రం అట్టేపెట్టుకుని మిగిలిన భూమిని మొత్తం రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ చేశారు.

 

రాజధాని నిర్మాణం పేరుతో అప్పట్లో చంద్రబాబునాయుడు రైతుల నుండి వివిధ రకాలుగా సుమారు 35 వేల ఎకరాలు తీసుకున్నారు. తనమీద నమ్మకంతో రైతులందరూ స్వచ్చందంగా భూములిచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోవటం నిజం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. స్వచ్చందంగా భూములిచ్చింది కొందరు మాత్రమే. మిగిలిన భూమిని రైతుల నుండి బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిడిపెట్టి రకరకాలుగా సేకరించారు.

 

సరే ఎవరి భూమిని ఎలా తీసుకున్నా తీసుకున్న వేలాది ఎకరాల్లో అత్యధికం నిరుపయోగంగానే ఉందన్నది వాస్తవం. తాత్కాలికం పేరుతో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు  నాసిరకం భవనాలున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి భూములు పోను మిగిలిన భూమినంతా తిరిగి రైతులకు వాపసు చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం చూస్తే దాదాపు 30 వేల ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాల్సుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తిరిగిచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సరే ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ? అన్నదే సమస్య. ఎందుకంటే పది సెంట్లున్న రైతుల మొదలుకుని 10 ఎకరాలున్న రైతుల వరకూ అందరి నుండి భూమిని తీసుకున్నారు. ఈ భూమి మొత్తాన్ని ఏకచెక్కగా చేసేశారు.

 

అప్పట్లో అంటే ఎవరి భూమికి వాళ్ళు సరిహద్దులుండేవి. కానీ ఇపుడు మొత్తాన్ని ఏకం చేసేశారు. పైగా అందులో కొంత భూమిని రైతులకు రిజిస్ట్రేషన్ చేసేయటం, దానికన్నా ముందే కొందరు అసైన్డ్ రైతులు ఇతరులకు అమ్మేయటం లాంటివి చాలా జరిగాయి. మొత్తానికి తీసుకున్న భూమిని తిరిగిచ్చేయటమంటే అంత సులభంకాదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: