సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల విష‌యంలో ఇదో గుడ్ న్యూస్‌. అందులోనూ హైద‌రాబాదీల విష‌యంలో కాలర్ ఎగుర‌వేసి చెప్పే విష‌యం. ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్న రంగాల్లో ఐటీ రంగం మరోసారి టాప్‌లో నిలిచింది. రాండ్‌స్టడ్ సంస్థ తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఈ సర్వేను చేసిన రాండ్‌స్టడ్...15 రంగాల్లో గల వివిధ శ్రేణుల్లోని లక్ష మంది ఉద్యోగుల వార్షిక వేతనాలను పరిశీలించింది. అన్ని రంగాల్లో నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఈ సర్వే జరుగగా, వివిధ శ్రేణుల్లోని లక్షమంది జీతాలను పరిశీలించారు.

 

జూనియర్ స్థాయి ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆకర్షణీయమైన జీతాలు లభిస్తున్నాయని రాండ్‌స్టడ్ వెల్ల‌డించింది. దేశంలోనే భాగ్యనగరం ఈ విషయంలో రెండో స్థానంలో ఉంది. వార్షిక వేతనం ఇక్కడ సగటున రూ.5 లక్షలుగా ఉన్నట్లు రాండ్‌స్టడ్ ఇన్‌సైట్స్ సాలరీ ట్రెండ్స్ రిపోర్ట్-2019 గురువారం తెలియజేసింది. బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, అక్కడ జూనియర్-లెవల్ ఉద్యోగులకు ఏటా సగటున రూ.5.27 లక్షలు వస్తున్నాయి. కాగా, మధ్య శ్రేణి ఉద్యోగులకు రూ.16.45 లక్షలు, సీనియర్ స్థాయి ఉద్యోగులకు రూ.35.45 లక్షలు సగటు వార్షిక జీతాలుగా ఉన్నాయి. దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ ఈ సందర్భంగా తెలిపింది.

 

గత రెండు సంవత్సరాల్లోనూ సాలరీ ట్రెండ్స్ రిపోర్టుల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా, ఈ ఏడాదీ దాని ఆధిపత్యం కొనసాగింది. జూనియర్ల జీతాల విషయంలో ముంబై మూడో స్థానంలో ఉండగా, ఏటా సగటున రూ.4.59 లక్షలు వస్తున్నాయి. అయితే మిడ్-లెవల్ ఉద్యోగుల జీతాల్లో ముంబై (రూ.15.07 లక్షలు) రెండో స్థానంలో ఉన్నది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (రూ.14.50 లక్షలు) మూడో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లోనూ ముంబై (రూ.33.95 లక్షలు) రెండో స్థానంలో ఉండగా, పుణె (రూ.32.68 లక్షలు) మూడో స్థానంలో ఉంది. 

 

ఈ రంగంలో జూనియర్ ఉద్యోగులకు సగటున రూ.4.96 లక్షల వార్షిక వేతనం అందుతున్నది. సీనియర్ ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.35.84 లక్షలుగా ఉన్నదని రాండ్‌స్టడ్ తమ తాజా నివేదికలో చెప్పింది. కాగా, డిజిటల్ మార్కెటీర్లు కూడా సీనియర్ స్థాయి ఉద్యోగులకు అత్యధిక వేతనాలను ఇస్తున్నట్లు తేలింది. సగటున రూ.35.65 లక్షలు ఇస్తున్నారని రాండ్‌స్టడ్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: