అధికార వైసిపి ఎంపి పోలీసు సిబ్బంది బూట్లను శుభ్రంగా తుడిచి తర్వాత ముద్దు పెట్టుకున్నాడు. చదవటానికే విచిత్రంగా ఉంది. అయినా వాస్తవంగా జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే అనంతపురం మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే  తమ బూట్లు నాకే పోలీసు అధికారులను పోస్టింగుల్లోకి తెచ్చుకుంటామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

 

పోలీసులను అవమానిస్తు జేసి చేసిన ప్రకటనపై వైసిపి హిందుపురం ఎంపి గోరంట్ల మాధవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం జేసికి బాగా అలవాటే అంటూ గోరంట్ల సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా పోలీసుల బూట్లను శుభ్రం చేసిన గోరంట్ల తర్వాత ముద్దాడారు. గతంలో గోరంట్ల కూడా పోలీసు శాఖలో పనిచేశాడన్న విషయం అందరికీ తెలిసిందే.

 

మొన్నటి ఎన్నికలకు ముందు తాడపత్రిలోని ప్రభోదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులతో జేసి దివాకర్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత వివాదం అప్పట్లో సంచలనమైంది. ఆశ్రమ నిర్వాహకులకు-జేసి మద్దతుదారులకు సుమార వారంరోజుల పాటు రోడ్లపై పెద్ద యుద్ధమే జరిగింది. ఆ సమయంలో  ఆశ్రమంలోని వాళ్ళను పోలీసులు అరెస్టు చేయటం లేదన్న కోపంతో జేసి పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారు.

 

అప్పట్లో కదిరి సిఐగా ఉన్న గోరంట్ల మాధవ్ తీవ్రంగా రియాక్టయ్యారు.  పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడితే  నాలుకను చీరేస్తానంటూ జేసికి చేసిన హెచ్చరికలు కలకలం రేపాయి. దాంతో జేసికి పోలీసులకు పెద్ద గొడవలే అయ్యాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి హిందుపురం ఎంపిగా పోటి చేసి గెలిచారు.

 

అప్పటి నుండి జిల్లాలో పోలీసులకు ఎవరికి ఎక్కడ ఇబ్బందులుదురైనా వెంటనే మాధవ్ స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే జేసి తాజా వ్యాఖ్యలపైన కూడా మాధవ్ గట్టిగా రియాక్ట్ అయ్యారు. పోలీసు అధికారిగా ఉన్నపుడే జేసిని లెక్కచేయని మాధవ్ ఎంపిగా ఉంటే పట్టించుకుంటారా ? అందుకే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇదే సందర్భంగా మాధవ్ పోలీసుల బూట్లను శుభ్రం చేసి ముద్దు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: