సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చని చేసిన ప్రకటన పట్ల రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం రాజధాని ప్రాంతం అధ్యయనం కొరకు కొన్ని నెలల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ సభ్యులు తాడేపల్లి లోని సీఎం క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ' 
 
కమిటీ సభ్యులు నివేదికను సీఎం జగన్ కు సమర్పించారు. రాజధాని సహా ఏపీ సమగ్ర అభివృద్ధి కొరకు ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ 13 జిల్లాల ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించింది. అమరావతి, వైజాగ్, కర్నూల్ సహా ఇతర ప్రాంతాల అభివృద్ధి, రాజధానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందనే కోణంలో కమిటీ పరిశీలనలు జరిపింది. 40వేలకు పైగా వినతులు వచ్చాయని ఆ వినతులను కమిటీ పరిశీలించిందని సమాచారం. 
 
ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను ఇచ్చింది. మధ్యంతర నివేదికను పరిశీలించిన తరువాతే సీఎం జగన్ మూడు రాజధానుల గురించి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. తుది నివేదిక పరిశీలన అనంతరం సీఎం జగన్ అమరావతి, కర్నూలు, వైజాగ్ లను రాజధానులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13వ తేదీన రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అర్కిటెక్టర్ డాక్టర్ మహావీర్, సెఫ్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నైకు చెందిన రిటైర్డ్ అర్బన్ ప్లానర్ అరుణాచలం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్రన్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసిన కమిటీ తుది నివేదికను సీఎం జగన్ కు అందజేసింది. సీఎం జగన్ నివేదిక పరిశీలన అనంతరం చేసే ప్రకటన కొరకు ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: