ఏపీ రాజధాని అంశంపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ కీలకమైన జీఎన్ రావు కమిటీ తన నివేదికను రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. ఆ వివరాలను మీడియాకు వివరించింది. ‘తుళ్లూరు ప్రాంతంలోనే అసెంబ్లీ ఉండాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండాలి. ఎండాకాలంలో శాసనసభ సమావేశాలు కూడా విశాఖలో నిర్వహించాలి. కర్నూలులో హైకోర్టు, ఒక బెంచ్ అమరావతిలో, మరో బెంచ్ విశాఖలో ఉండాలని చెప్పాం. అమరావతిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతాయి. అమరావతిలోనే గవర్నర్ కార్యాలయం రాజ్‍భవన్ కొనసాగాలి. విశాఖలో సచివాలయం, అన్ని శాఖల కార్యాలయాలు ఉండాలి’.

 

 

ఇంకా కమిటీ తన వివరాలు చెప్తూ.. ‘ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మా నివేదిక ఉంది. రాజధాని, అభివృద్ధి అనే అంశాలపై అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్ర అభివృద్ధితోపాటు పర్యావరణ సంరక్షణను దృష్టిలో ఉంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. అంతా ఒకే చోట కాకుండా అందరికీ అన్ని అనుకూలంగా ఉండే సూచనలు చేశాం. సమగ్రమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక కోసం ప్రయత్నించాం. ఏపీలో ప్రాంతీయ అసమానతలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాం. అన్ని ప్రాంతాల మధ్య సమతూకం కోసం సూచనలు చేశాం. కొన్ని ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి’.

 

 

‘ఆంధ్రప్రదేశ్‍కు సుదీర్ఘమైన తీర ప్రాంతం, అడవులు, నదులు ఉన్నాయి. ప్రాంతాల మధ్య అభివృద్ధి, సమన్వయంపై పరిశీలన చేశాం. వ్యూహాత్మక అభివృద్ధిపై పలు సూచనలు చేశాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలను, ప్రతినిధులను కలిశాం. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించమని చెప్పాం. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్లుగా ఉండాలని చెప్పాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది.’ అని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: