పౌరసత్వ సవరణ చట్టం రాజకీయంగా కాక రేపుతోంది. దేశవ్యాప్తంగా రిఫరెండం నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థతో పాటు దేశంలో శాంతిని కూడా బీజేపీ ప్రభుత్వం సమాధి చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే  పౌరసత్వ సవరణ చట్టం కారణంగా భారత పౌరులెవరికీ నష్టం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. 


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాల్ విసిరారు. ఈ  రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు  భారత పౌరులుగా నిరూపించుకోవాలా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

 

దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశంలో శాంతిని, సామరస్యాన్ని కూడా మోడీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కాంగ్రెస్ మండిపడింది. ముందు చూపు లేని అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం.. తనకు తానుగా అశాంతిని రాజేసిందని ఆరోపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మొత్తుకున్నా కేంద్రం వినిపించుకోలేదని, ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని అభిప్రాయపడింది. 

 

సీసీఏకు  సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం  నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత  చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. దేశంలో పలు  ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరూ శాంతియుతంగా, కలిసికట్టుగా ఉండాలని కోరారు. హింసాకాండతో సమస్యలు సమసిపోవని ఆయన  హితవు పలికారు. దేశంలో జరుగుతున్న అల్లర్లపై తీవ్రంగా కలత చెందానన్నారు. అయితే రజనీకాంత్‌ సీఏఏను ఆమోదిస్తున్నట్టు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక  రజనీ ట్వీట్‌పై ఆయన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. శాంతి మార్గంలో పోరాడుదాం అని కొందరు ఆయన  మాటలతో ఏకీభవిస్తుండగా, నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: