ప్రధాని మోడీకి పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రాజీవ్ గాంధీ తరహాలో జనం మధ్యే చంపేయాలని కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. మరోవైపు మోడీని హత్య చేయడానికి మావోయిస్టులు కుట్ర పన్నిన కేసులో పుణె ప్రత్యేక న్యాయస్థానంలో ముంబై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 

 

ప్రధాని నరేంద్ర మోడీని పాక్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నెల 22న రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో మోడీ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనను చంపేయాలని పాక్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రధాని స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్, ఢిల్లీ పోలీసుల్ని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. ఢిల్లీలోని అనధికార కాలనీలను కేంద్రం రెగ్యులరేజ్ చేయనుండటంతో దీనిని హైలైట్ చేసేందుకు బీజేపీ ఈ ర్యాలీని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనుంది.

 

మోడీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉన్నందున పీఎం రక్షణకు ఉద్దేశించిన బ్లూ బుక్‌లో పేర్కొన్న జాగ్రత్తలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఏజెన్సీలు భద్రతా సంస్థలకు ఆదేశాలిచ్చాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు రామ్‌లీలా మైదాన్‌కు వచ్చే అవకాశాలున్నాయని, దీనిని ఆసరాగా తీసుకుని పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు పాల్పడొచ్చని ఏజెన్సీలు చెబుతున్నాయి. మోడీతో పాటు ఎన్‌డీఏ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ ర్యాలీలో పాల్గోనున్నారు.

 

మహారాష్ట్ర ఎల్గార్‌ పరిషత్‌ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్‌ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దాంతో మావోయిస్టు సానుభూతిపరులైన హక్కుల నేతలకు ప్రమేయం ఉందని పుణెలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ హక్కుల నేతల్లో విప్లవ రచయిత వరవరరావు, సుధీర్‌ ధవాళే, రోనా విల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, షోమా సేన్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్మన్‌ గోంసాల్వెస్‌, సుధా భరద్వాజ్‌ ఉన్నారు.

 

2017 డిసెంబరు 31న భీమా కోరెగాం ప్రాంతంలో ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం జరిగింది. ఇది మావోయిస్టులు ఏర్పాటు చేసినదేనని పోలీసుల ఆరోపణ. దీని అనంతరం బీమా కోరెగాం సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు సాగడం, తదనంతర హింస... రాజకీయంగా దుమారం రేపాయి. వీటికి హక్కుల నేతలే కారణమని ఆరోపిస్తూ ఈ తొమ్మిది మందినీ నిర్బంధించారు. దాదాపు రెండేళ్ల తరువాత ఇపుడు చార్జిషీటు దాఖలు చేశారు. మోడీని టార్గెట్ చేయడానికి 8 కోట్ల నగదు, ఓ అత్యాధునికమైన ఎం-4 రైఫిల్‌, 4 లక్షల రౌండ్ ల మందుగుండు, మరికొన్ని మారణాయుధాలను ఓ సప్లయర్‌ నుంచి నేపాల్‌, మణిపూర్‌ మీదుగా తీసుకురావాలని ప్రయత్నించినట్టు పోలీసులు ఆరోపించారు. ప్రత్యేక కోర్టు జడ్జి వీటిని పరిశీలించి అభియోగాల నమోదుకు ఉత్తర్వు లిస్తే లాంఛనంగా విచారణ సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: