పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ నిర‌స‌నలు హింసాత్మ‌క రూపం దాల్చుతున్నాయి. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌లో ఆరుగురు మృతిచెందారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా రాష్ట్రాంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు మిన్నంటాయి.  బిజ్నూర్‌లో ఇద్ద‌రు, సంభ‌ల్‌, ఫిరోజాబాద్‌, మీర‌ట్‌, కన్పూర్‌లో ఒక్కొక్క ఆందోళ‌న‌కారుడు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌గా...ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ ఘాటు కామెంట్లు చేశారు.

 

 


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు.  దీంతో ప‌లు న‌గ‌రాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. 144వ సెక్ష‌న్ విధించినా.. ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు గోర‌ఖ్‌పూర్‌లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. బులంద్‌షెహ‌ర్ ప‌ట్ట‌ణంలో ఆందోళ‌న‌కారులు వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. ప‌ట్ట‌ణ‌మంతా పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించారు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు జ‌రిగాయి. ల‌క్నోతో పాటు ప‌లు న‌గ‌రాల్లో పోలీసులు డ్రోన్ల‌తో భ‌ద్ర‌త‌ను స‌మీక్షించారు. కాగా, ఇంట‌ర్నెట్‌ను నిలిపివేయ‌డంతో అల‌హాబాద్ కోర్టులో ఇవాళ ఆన్‌లైన్ సేవ‌లు స్తంభించాయి. హింస‌కు దిగితే ఊరుకునేది లేద‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌రాద‌న్నారు. ఆందోళ‌న‌కు పాల్ప‌డిన వారిని సీసీటీవీ ఫూటేజ్‌ ద్వారా గుర్తిస్తున్నామ‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా విధ్వంసం సృష్టిస్తే.. వారి ఆస్తుల‌ను జ‌ప్తు చేసి.. ప్ర‌భుత్వ ఆస్తుల‌కు న‌ష్ట‌ప‌రిహారంగా వేలం వేస్తామ‌ని సీఎం వార్నింగ్ ఇచ్చారు. 

 

 

ఇదిలాఉండ‌గా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం త‌మ‌కు హ‌క్కు అని అన్నారు. కానీ హింస‌ను ఖండిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నిర‌స‌న‌ల్లో హింస‌కు దిగుతున్న‌వారు.. ఆ ఆందోళ‌న‌ల‌కు శ‌త్రువుల‌వుతార‌న్నారు. ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని కానీ, వాటిని శాంతియుతంగా చేప‌డితేనే ఫ‌లితం ఉంటుంద‌ని ఓవైసీ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: