వైద్య వృత్తికే అవమానం తెచ్చారు డాక్టర్లు. ఆస్పత్రికి డెలివరీకి వచ్చిన ఒక మహిళకు డెలివరీ చేసే సమయంలో శిశువు తలను కోసేశారు. అత్యంత దారుణానికి పాల్పడ్డ డాక్టర్ పై, ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆస్పత్రి బయట బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ దారుణ సంఘటన తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. 

 

బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్ఛంపేటకు చెందిన ఒక గర్భిణిని స్థానిక ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆ గర్భిణికి అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డెలివరీ కోసం ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు సరే అనడంతో ఆపరేషన్ మొదలుపెట్టారు డాక్టర్లు, సిజేరియన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించి శిశువు తలను కోసేశారు దీనితొ గర్భిణి కడుపులోనే శిశువు మరణించింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు.

 

ఉన్నటుండి శిశువు గర్భిణీ కడుపులో చనిపోవడమేంటని గర్భిణీ తరపు బంధువులు ఆస్పత్రి యాజమాన్యంతో వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయానికి గానూ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

 

ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదని సమాచారం. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంబిస్తున్నాయి. ఇలాంటి దారుణాలకు కారణమైన వైద్యుల లైసెన్స్ వెంటనే రద్దు లేదా కొన్ని సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తారు. గతంలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కొందరు కంటిచూపు పోగొట్టుకోగా ఆ డాక్టర్ల లైసెన్స్ ను రద్దు చేసింది ఒక ప్రభుత్వం. ఈ ఘటనకు పాల్పడిన డాక్టర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: