దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ అత్యాచారం, నిందితుల ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌లో ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్ప‌టికే నిందితుల ఎన్ కౌంట‌ర్ విష‌యంలో వారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను టార్గెట్ చేయ‌డం, ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. అదే స‌మ‌యంలోత‌మ‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని కూడా కోరుతుండ‌టంపై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ స‌మ‌యంలో పోలీసుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలే అవ‌కాశం ఉందంటున్నారు. హైదరాబాద్ గాంధీ దవాఖానలో ఉన్న దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేసేలా ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో, రీపోస్ట్‌మార్టంలో ఏం తేల‌నుందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

 

ఎన్‌కౌంట‌ర్‌పై సందేహాలు, మృతదేహాల నుంచి ఆధారాల సేకరణ కోరుతూ... సుప్రీంకోర్టులో దిశ నిందితుల కుటుంబ స‌భ్యులు పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టే సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. దీంతో చీఫ్‌జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. సుప్రీం స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలు జారీచేసినందున, ప్రస్తుతం బంతి తమ కోర్టులో పడిందని వ్యాఖ్యానించింది. బయటి రాష్ర్టాల వైద్యనిపుణులతో రీపోస్ట్‌మార్టం చేయిస్తే అనుమానాలు తొలిగిపోతాయని తెలిపింది. మృతదేహాల సంరక్షణ కష్టమవుతున్నదన్న గాంధీ వైద్యుల ఆందోళన నేపథ్యంలో త్వరగా నిర్ణ యం తీసుకోవాల్సి ఉన్నదని చీఫ్‌జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడిం ది. మృతదేహాలకు ఇప్పటికే పోస్ట్‌మార్టం నిర్వహించినందున మళ్లీ అవసరంలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.

 

అయితే,  రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదని, పిటిషన్‌లోనూ రీపోస్ట్‌మార్టం విజ్ఞప్తిలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రస్తుత పిటిషన్, గతంలో దాఖలైన పిటిషన్లకు సంబంధించినది కాదని, స్వతంత్ర పిటిషన్ అని, గత ఆదేశాలే కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ వాదనతో విభేదించిన ధర్మాసనం, గతంలో హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ, తదుపరి ఉత్తర్వుల వరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు తెలిపిందని.. ప్రస్తుతం ఆధారాల సేకరణపై హైకో ర్టే సరైన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేసిందని గుర్తుచేసింది. ఏజీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవడానికి శనివారం వరకు గడువు ఇస్తూ విచారణను వాయిదావేసింది. ఈ నేప‌థ్యంలో కోర్టు నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: