ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టిన రోజును పుర్కరించుకుని చేనేత కార్మికుల మధ్య గడపనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన  వైఎస్సార్ చేనేత భరోసా నగదును నేతన్నలకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనున్నారు. సీఎం జగన్‌ జన్మదినం కూడా శనివారమే కావడంతో వేదికపైనే జన్మదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో అనంతపురం చేరుకున్నారు. ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సీఎం పాల్గొన్నారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. 


హ్యాపీ బర్త్ డే టు యు జగన్..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయనతో ఉన్నతాధికారులు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. కాగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్‌ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు.

మంత్రులు సైతం..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్బంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు అదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: