తెలంగాణా లో త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం కొత్త పాలసీ తేనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది అమలులోకి వస్తే.. అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది.  తెలంగాణా రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

 

ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి ..సులభంగా, అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందేలా నూతన విధానం  తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రాష్ట్ర పురపాలక శాఖ భవిష్యత్తు కార్యాచరణను, అందులో టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి ఆశిస్తున్న పనితీరుపైన కూలంకశంగా మంత్రి కేటీఆర్ వివరించారు. 

 

దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ శాఖ సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించి, అత్యంత పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇచ్చే నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని సమావేశంలో కేటీఆర్ అన్నారు. కొత్త విధానంలో  రాష్ట్రంలో 75 గజాల లోపు భవన నిర్మాణం చేపట్టే వారికి కేవలం రిజిస్ర్టేషన్ చేసుకుంటే సరిపోతుందని, 600 గజాలలోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, 600 గజాలపైన భవన నిర్మాణ అనుమతులకు సింగిల్విండో పద్ధతిలో అనుమతులకు ఈ నూతన విధానం వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. 

 

సంప్రదాయకంగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తిగా మార్చేటప్పుడు, కొన్ని సవాళ్లు ఎదురవుతాయని ...వాటిని ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు మంత్రి.  గతంలో పరిశ్రమల శాఖ అనుమతుల విధానం పూర్తిగా మార్చి సింగిల్విండో పద్ధతి విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించామని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. 

 

మరోవైపు.. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపైనా కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించబోమని తెలిపారు. నూతన పురపాలక చట్టంలో పురపాలక ఉద్యోగులు, పాలక మండళ్లపైనా కఠిన చర్యలు తీసుకునే వీలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలోగ్గాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో సిబ్బందికి తాను అండగా ఉంటానని మంత్రి తెలిపారు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: