వీకే శ‌శిక‌ళ... త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు. దాదాపుగా గ‌త మూడేళ్లుగా శ‌శిక‌ళ బెంగుళూరులోని అగ్ర‌హారం జైలులో శిక్ష‌ను అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలి హోదాలో ఆమె క‌ళ్లు చెదిరే ఆస్తులు సంపాదించారు. ఇప్ప‌టికే ఆమెకు చెందిన సుమారు 1600 కోట్ల విలువైన ఆస్తుల‌ను బినామీ చ‌ట్టం కింద అటాచ్‌ చేశారు. తాజాగా మ‌రో షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ర‌ద్దు అయిన క‌రెన్సీ నోట్ల‌తో షాపింగ్ మాల్స్‌ కొన్న‌ట్లు ఆదాయ‌ప‌న్ను శాఖ ద‌ర్యాప్తులో తేలింది. 

 

2016, నవంబ‌ర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ర‌ద్దు చేసిన 500, వెయ్యి నోట్ల‌తో శ‌శిక‌ళ .. ఓ రిసార్ట్‌ను, రెండు షాపింగ్ మాళ్లు, సాఫ్ట్‌వేర్ కంపెనీ, షుగ‌ర్ మిల్లు, 50 విండ్‌మిల్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటి ఖ‌రీదు వంద‌ల కోట్లు ఉంటాయ‌ని అనుమానిస్తున్నారు. శ‌శిక‌ళ ఆస్తుల‌ను అంచ‌నా వేసిన ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు జ‌స్టిస్ అనితా సుమంత్‌కు ఈ వివ‌రాలు తెలిపారు. ఆదాయ‌ప‌న్ను శాఖ మ‌ద్రాసు కోర్టుకు తెలియ‌జేసింది. త్వ‌ర‌లో త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలి ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

కాగా, జైలులో కూడా శ‌శిక‌ళ త‌న ఆర్భాటాలు కొన‌సాగించిన సంగ‌తి తెలిసిందే. జైలులో ప్ర‌త్యేక కిచెన్ ఏర్పాటు చేసేందుకు ఓ జైలు అధికారికి శ‌శిక‌ళ రెండు కోట్లు లంచం ఇచ్చిన‌ట్లు కూడా తేలింది. త‌న‌కు వండి పెట్టేందుకు శ‌శిక‌ళ జైలులో స్పెష‌ల్ కిచ‌న్ ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హెచ్ఎన్ స‌త్య‌నారాయ‌ణ రావుకు కూడా ముడుపులు ముట్టిన‌ట్లు రూప త‌యారు చేసిన నివేదిక‌లో వెల్ల‌డైంది. జైళ్ల శాఖ‌లో డీఐజీగా రూప బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాతే అగ్ర‌హార జైలులో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై నివేదిక త‌యారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: