ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తావించిన మూడు రాజధానుల అంశానికి, జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికకు మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం సముచితమని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయటం శుభపరిణామమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అమరావతి ప్రాంత రైతుల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన లేఖలోని సారాంశం..

 

 

‘మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ మంచి నిర్ణయం. ఇందుకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది. రాష్ట్రం విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలను తొలగించేవిగా ఉన్నాయి. గత అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‍లోనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్ధిక, సమాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇంకో రూ.లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఉంది. అమరావతిని శాసన, విశాఖను కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలి’ అంటూ మెగస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలిపారు.

 

 

ఈ లేఖతో ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై తన నిర్ణయాన్ని బాహాటంగానే ప్రకటించారు చిరంజీవి. అయితే ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా జగన్ నిర్ణయం పట్ల అంత సుముఖంగా లేరు. మరో తమ్ముడు నాగబాబు కూడా పవన్ తోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం నిర్ణయానికి చిరంజీవి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: