ఏడు నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాంతీయ, కుల, మత, భాష తత్వాలను రెచ్చగొడుతున్నారు. వాస్తవానికి అమరావతి 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉంది. నాడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. దాంతో ఆ పార్టీ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేసుకున్నది. వైసీపీకి కూడా  అదే గతి పడుతుంది. నాడు తల్లినిచంపారు, నేడు ఎదిగే బిడ్డ తల పగులగొడుతున్నారు. ఈ స్థితిలో పెట్టుబడులు ఎవరూ పెట్టే పరిస్థితి లేదు. అభివృద్ధి కుంటుపడిపోయింది. విశాఖలో భూకబ్జాలకు, బాక్సైట్‌, బీచ్‌సాండ్‌, పరిశ్రమల్లో వాటా కొట్టేయడానికి జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డి విశాఖకు చేరుతున్నార అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.   


ముక్కచక్కలవుతున్న రాజధానిని చూసి  పక్క రాష్ట్రాలు పండుగ చేసుకుంటున్నాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమకు పెద్దగా చేకూరే ప్రయోజనంలేదు.  చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ (సిబిఐసి)లో కర్నూలు నోడ్‌ గా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. రాయలసీమలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలి. ఖనిజాలకు కణాచి అయిన రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతం. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి. విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. ఈ పనులు చేయకుండా మూడు ముక్కలు చేసిన హైకోర్టు వల్ల రాయలసీమకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది అభివృద్ధి వికేంద్రీకరణా?  లేక రాజకీయ కుట్రా?

 

 ఆదాని డేటా సెంటర్‌, దుబాయ్‌ కి చెందిన లుల్లూ గ్రూప్‌ వంటి వాటితోపాటు అనేక అంకుర పరిశ్రమలను  తరిమివేసి విశాఖలో ఏం అభివృద్ధి చేస్తారు?. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (విసిఐసి)ని అభివృద్ధి చేయాలి.  ఇందులో విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాళహస్తిలను పారిశ్రామిక హబ్‌ లుగా తీర్చిదిద్దాలి. ఈ కారిడార్‌ లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి, లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం  ఉంది.

 

 ఇచ్చాపురం-విశాఖ బీచ్‌ రోడ్డు పూర్తి చేయాలి. విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ని కూడా అభివృద్ధి చేయాలి. వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ ని విశాఖ రైల్వే జోన్‌లో కలపాలి. భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ పనులు ఏం చేయకుండా జగన్‌ ప్రభుత్వం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. విశాఖను ఫ్యాక్షనిస్టు కేంద్రంగా, భూకబ్జాలమయం చేయబోతున్నది.  

 

  నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గుర్తించారు. శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జగన్‌ అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా బలపరిచారు. 30 వేల ఎకరాల్లో నిర్మించాలన్నారు. దేశ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చారు.  ఏపీ రాజధాని అంటే అమరావతే. ఇప్పటికే రూ.9వేల కోట్ల వ్యయంతో ప్రజా రాజధాని అమరావతిలో భారీ నిర్మాణాలు జరిగాయి. ఈ పరిస్థితులలో రాజధాని  వ్యవస్థని చిన్నాభిన్నం చేయడమవుతుంది. ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల అభివృద్ధి ఒక్కసారిగా ఆగిపోయింది. 

 

పెట్టుబడిదారులు వెనక్కు వెళ్లారు. ఉపాధి పోయింది.  అభివృద్ధికి అవకాశం ఉన్న మార్గాలను విచ్ఛిన్నం చేసి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. వైజాగ్‌ ని పులివెందుల పంచాయతీలకు, కబ్జాలకు, రౌడీయిజానికి నిలయంగా చేస్తారు. ఇప్పటికే కబ్జాలు, బెదిరింపులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేథావులు, రాజకీయ పార్టీల వారు, యువత, విద్యార్థులు, రైతులు అందరూ  జగన్‌ విచ్ఛిన్నకర చర్యలను వ్యతిరేకించవలసి ఉంది. అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: